
రాష్ట్రంలో డీఎంకే 161 నుంచి 169 స్థానాలు చేజిక్కించుకోవడం ఖాయం అని తేల్చింది.
సాక్షి, చెన్నై: సర్వేలన్నీ డీఎంకే అధికారం తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఏబీపీ సర్వే కూడా డీఎంకేకు పట్టం కట్టేందుకు తమిళ ఓటర్లు సిద్ధమయ్యారని ప్రకటించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, ఈ సారి అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా పరుగులు తీస్తోంది. ఆపార్టీ అభ్యర్థులు 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. మిత్రపక్షాలు కొన్ని డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వెలువడ్డ రెండు సర్వేలు రాష్ట్రంలో డీఎంకే అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ప్రకటించాయి. తాజాగా ఏబీపీ సీ ఓటర్స్ సర్వే సాగింది. మంగళవారం వెలువడ్డ ఈ సర్వే ఫలితాల మేరకు రాష్ట్రంలో డీఎంకే 161 నుంచి 169 స్థానాలు చేజిక్కించుకోవడం ఖాయం అని తేల్చింది. అన్నాడీఎంకేకు 53 నుంచి 61 స్థానాలు దక్కనున్నాయి. కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం ఖాతా తెరవబోతున్నది. రెండు నుంచి ఆరు మధ్య సీట్లను ఈ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దినకరన్ పార్టీకి 1 నుంచి 5 వరకు సీట్లు దక్కవచ్చని సర్వేలో తేలింది.
సుడిగాలి ప్రచారంలో..
‘ముఖ్య’ నేతలు పళనిస్వామి, స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంగళవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సేలం ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో రోడ్లపై నడుచుకుంటూ తమను ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకే అవినీతిని ఎండగట్టే రీతిలో ప్రసంగాన్ని సాగించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్, సీఎం పళని స్వామి పుదుకోట్టై జిల్లా విలాతికులంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 18 నుంచి 22వ తేదీ వరకు 46 నియోజకవర్గాల్ని కలుపుతూ పళని ప్రచార పర్యటన సాగబోతోంది. మక్కల్ నీది మయ్యం నేత కమల్ తాను పోటీ చేస్తున్న కోవై దక్షిణం నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం సాగించారు.
రోడ్‌షోను తలపించే రీతిలో కాసేపు, మరికాసేపు నడుచుకుంటూ, ప్రజలతో ముచ్చటిస్తూ తనను ఆదరించడమే కాదు, మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం అభ్యర్థులందర్ని గెలిపించాలని కోరారు. రాజకీయాలు తనకు వృత్తి కాదని, బాధ్యత అని నినదిస్తూ ప్రచారం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువొత్తియూరులో మంగళవారం సాయంత్రం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు పొన్నేరి, మాధవరం, అంబత్తూరు, ఆవడి, పూందమల్లి, మధురవాయిల్ నియోజకవర్గాల్ని కలుపుతూ ఆయన పర్యటన సాగింది.