
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్‌పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.

డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్‌లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment