పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్‌ వార్నింగ్‌! | Tamil Nadu: Kamal Haasan Serious Warning To MNM Party Activists | Sakshi
Sakshi News home page

పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్‌ వార్నింగ్‌!

Published Tue, Aug 31 2021 10:03 AM | Last Updated on Tue, Aug 31 2021 11:43 AM

Tamil Nadu: Kamal Haasan Serious Warning To MNM Party Activists - Sakshi

‘‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. అప్పుడే స్థానిక ఎన్నికల్లో సత్తాచాటగలం. గెలుపుగుర్రాలను గుర్తించి.. ప్రోత్సహించాలి అలా పనిచేయలేని వారు గౌరవంగా తప్పుకోండి..’’ అంటూ ఎంఎన్‌ఎం   అధ్యక్షుడు, నటుడు కమల్‌ హాసన్‌ తేల్చిచెప్పారు. 

సాక్షి, చెన్నై: ‘పరాచకాలొద్దు..పనిచేయండి..లేదా తప్పుకోండి’ అని పార్టీ జిల్లా కార్యదర్శులను మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్‌ హెచ్చరించారు. లక్ష్యాల సాధనకు వారికి 70 రోజుల గడువు కూడా విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరం కోసం కమల్‌ ఈమేరకు కసరత్తు ప్రారంభించారు. రాజకీయ అరంగేట్రం చేసి, తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టినా.. కమల్‌హాసన్‌ బోణి కొట్టలేక పోయారు. అయితే కనీస ఓట్ల శాతాన్ని మాత్రం తన పార్టీ ఖాతాల్లో వేసుకోగలిగారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించినా ఎక్కడా గెలుపు మాత్రం దక్కలేదు.
చదవండి: వైరల్‌ : పండిత్‌ రవిశంకర్‌తో రజనీకాంత్‌.. ఫోటో వైరల్‌

కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి స్వయంగా తాను పోటీ చేసి.. చివరి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీ అధ్యక్షుడే ఓడిపోవడంతో ప్రధాన కార్యదర్శి సహా పార్టీ కీలక పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కమల్‌హాసనే మోస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను చాలెంజ్‌గా తీసుకున్న కమల్‌.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. 
చదవండి: కోపంతో చేతిలోని ఫోన్‌ విసిరిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. 
ఇందుకు సంబంధించి గత వారం పార్టీ కార్యదర్శులతో సమావేశమైనారు. పార్టీ నిర్వహణపై అలసత్వం, అలక్ష్యం వద్దు, సీరియస్‌గా తీసుకోండని జిల్లా కార్యదర్శులకు హితవు వలికినట్లు సమాచారం. అంతేగాక పార్టీ బలోపేతానికి 70 రోజులు గడువు విధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీ నిర్వాహకుడు ఒకరు సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గడువు విధించిన మాట నిజమే, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే ఆయన లక్ష్యమని వెల్లడించారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో సరైన అర్హత కలిగిన కొత్త వారిని నియమించాలి. పార్టీ శాఖలు ఏర్పడని గ్రామాలు, ఊర్లు లేవనే స్థితికి రావాలి. ఈ పనులన్నీ 70 రోజుల్లోగా పూర్తి చేయాలి. గడువులోగా ఈ పనులన్నీ పూర్తి చేయని పక్షంలో ఎవరికి వారు బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి.

ఈ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే పదిరోజులు పూర్తయ్యింది. పార్టీ కార్యక్రమాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఒక్కో జిల్లా కార్యదర్శి పరి«ధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. ఇలా 114 జిల్లా కార్యదర్శులు పార్టీ బలోపేతం కోసం వారికి అప్పగించిన పనులు కిందిస్థాయి కార్యకర్తల సహకారంతో గడువులోగా పూర్తి చేయాల్సి ఉంది. 20 రోజులకు ఒకసారి తాము పూర్తి చేసిన పనుల వివరాలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలి. ఈమేరకు సర్క్యులర్, వీడియో కాన్ఫరెన్స్, ప్రత్యక్ష సమావేశాల ద్వారా కమల్‌హాసన్‌ సదరు ఆదేశాలను జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని సమాయుత్తం చేయడం ఎంతో అవసరమని కమల్‌ పట్టుదలను ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement