సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పదవీ కాలం చెల్లిపోయినందున ఇకపై తాను పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శినని ఎడపాడి పళనిస్వామి తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్‌తో అన్నాడీఎంకేలో అంతర్గత పోరు మరో మలుపు తిరిగింది. జయ మరణం తరువాత కన్వీనర్, కో–కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి వ్యవహరించారు. పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి వర్గీయులు తెరపైకి తేవడంతో ఓపీఎస్, ఈపీఎస్ మధ్య నిప్పురాజుకుంది.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఎడపాడి ఈనెల 11వ తేదీ జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన అనుమతి లేకుండా నిర్వహించే జనరల్‌బాడీ సమావేశం, అందులో చేసే తీర్మానాలు చెల్లవని ఓపీఎస్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎడపాడి తనను తాను పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ప్రకటించుకోవడం చర్చకు దారితీసింది. కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వం గడువు ముగిసిపోయినందున కోశాధికారి పదవి నుంచి సైతం అతడిని తప్పించేందుకు ఎడపాడి వర్గం ప్రయత్నాలు చేస్తోంది.
కో కన్వీనర్‌గా ఉన్న ఎడపాడి పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ప్రకటించుకోవడంతో పన్నీర్ చేతిలోని కోశాధికారి పదవిపై పలువురు పోటీపడుతున్నారు. ఎడపాడి వర్గీయులైన సీనియర్ నేతలు కేపీ మునుస్వామి, ఎస్‌పీ వేలుమణి, విజయభాస్కర్ కోశాధికారి పగ్గాలు చేపట్టేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా సర్వసభ్య సమావేశ కార్యవర్గం ఎడపాడికి మద్దతు పలుకుతూ ఉత్తరం రాసింది. అంతేగాక జిల్లాల్లో మద్దతు తీర్మానాలు చేయడం ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment