
సాక్షి, హైదరాబాద్: ‘దేశ, విదేశాల అధిపతులనైనా కలవగలం.. దురదృష్టవశాత్తు ఇక్కడి స్టేట్ చీఫ్‌ను మాత్రం కలవలేం.. కనీసం దగ్గరగా వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు..రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరంగా ఉంది. ఇది మంచి ధోరణి కాదు..’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న తనను నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సేవా ఇంటర్నేషనల్, సీ–20 వర్కింగ్ గ్రూప్, సేవా భారతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన సీ–20 సమావేశాల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు..
‘ప్రజా ప్రతినిధులు సమాజ సేవకులు. ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి పాటు పడాలి. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు. అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రముఖుడు కనియన్ పుంగనాన ప్రజలంతా ఒక్కటేనని నినదించారు. ప్రస్తుత ప్రధానమంత్రి అదే నియమాన్ని పాటిస్తూ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారు. యావత్ ప్రపంచానికి భారత్ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసి ఆదుకుంది.
మన దేశంలోని వసుదైక కుటుంబానికి ఇది నిదర్శనం’అని తమిళిసై తెలిపారు. ‘తొలిసారిగా జీ20 ఫోరమ్‌కు 2023లో భారత్ అధ్యక్షత వహించడం గర్వకారణం. మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. స్వాతంత్య్ర శతాబ్ది వైపు పయనించే ‘అమృత్‌కాల్’దిశగా ఇదో ముందడుగు. నిరాక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం లేని దేశంగా భారత్ అవతరిస్తుంది.
అయితే అభివృద్ధి దిశగా చేసే పనిని కొందరు వ్యతిరేకిస్తారు కానీ పని చేయరు. నాయకులు అధికారులు, రాజ్‌భవన్ అందరూ ప్రజల కోసమే ఉన్నాం..’అని గవర్నర్ స్పష్టం చేశారు. జీ20 సౌస్ షెర్పా డీఎం కిరణ్, రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, సేవా ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్వాతి రామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment