![Tammineni Sitaram Comments On AP Budget - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/26/tammineni.jpg.webp?itok=Gs7FEAxX)
సాక్షి,అమరావతి: ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా అత్యంత జనరంజకమైన సామాన్యుడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించుకున్నామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ముఖ్యమంత్రి ముందుగానే చెప్పినట్లు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారంటూ ప్రభుత్వానికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. మంచి క్వాలిటీ పాలన అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే ఆయన అనేక సంక్షేమ పథకాలు, బడ్జెట్ అమలుచేయడం గొప్ప విషయమన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన సభనుద్దేశించి ప్రసంగించారు. ఈసారి సభ్యులు ఎన్నో ప్రజా సమస్యలను లేవనెత్తారని, ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతాయుతంగా సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. కానీ, టీడీపీ సభ్యుల తీరు బాధించిందని, ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన వారు బాధ్యత మరిచి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు.
శాసనసభ @ 61.45 గంటలు
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి 25 వరకు మొత్తం 12 రోజులపాటు జరిగినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. శుక్రవారం సభ ముగింపు సందర్భంగా మొత్తం సభా సమయం వివరాలను సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజుల్లో 61.45 గంటల పాటు సభ నడిచిందని వెల్లడించారు. ఇందులో 96 స్టార్ ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం చెప్పగా, మరో 30 స్టార్, మూడు అన్ స్టార్ ప్రశ్నలకు సమాధానాలను సభ ముందు ఉంచినట్లు తెలిపారు. షార్ట్ నోట్ ప్రశ్నలు ఏమీ లేవని, 11 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్టు వివరించారు. ఈసారి సభలో 103 మంది సభ్యులు ప్రసంగించారని, ఐదు స్వల్పకాలిక చర్చలు జరిగాయని వివరించారు. కాగ్ నివేదిక ఒకటి సభ ముందు ఉంచామని, ప్రభుత్వ తీర్మానాలు ఏమీ లేవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment