
ఎస్.రామాపురంలో బీజేపీ ఏజెంటుగా కూర్చున్న టీడీపీ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ, టీడీపీలు కుమ్మక్కయ్యాయి. నామమాత్రంగా కూడా కార్యకర్తల బలంలేని కమలం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీకి దిగింది. పోలింగ్ జరిగిన శనివారం నాడు టీడీపీ నేతలు, కార్యకర్తలను ఏజెంట్లుగా పెట్టుకుని బీజేపీ కథ నడిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బద్వేలు ఉప ఎన్నికలో సంప్రదాయానికి లోబడి పోటీ నుంచి తప్పుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. జనసేన సైతం చంద్రబాబు బాటలో నడిచింది. బీజేపీ మాత్రం బరిలోకి దిగి స్థానికేతరుడు పణతల సురేష్‌ను అభ్యర్థిగా పోటీకి నిలిపింది.
నామినేషన్ల రోజు నుంచే అటు టీడీపీ, ఇటు బీజేపీలు బద్వేలులో అక్రమ పొత్తుకు తెరలేపాయి. టీడీపీ పాత కాపులు, ప్రస్తుత బీజేపీ నేతలైన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి బద్వేలు నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో మంతనాలు సాగించారు. మద్దతు కోసం పలు దఫాలు చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం టీడీపీ నేతలు సమావేశమై బీజేపీకి ఓట్లు వేయాలని కార్యకర్తలకు చెప్పారు. దీంతో.. టీడీపీ నేతలు, కార్యకర్తలే శనివారం జరిగిన పోలింగ్‌లో ఏజెంట్ల అవతారం ఎత్తారు.
బీజేపీ తరఫున ఏజెంటుగా ఉన్న గోపవరం ఎంపీపీ భర్త, టీడీపీ నేత కొండయ్య
10 బూత్‌లలోనే బీజేపీ ఏజెంట్లు
బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల మండలాల పరిధిలో మొత్తం 281 పోలింగ్ బూత్‌లు ఉండగా, గోపవరం మండలంలో మూడు, బద్వేలు మండలంలోని 7 పోలింగ్ బూత్‌ల్లో మాత్రమే బీజేపీ కార్యకర్తలు ఏజెంట్లుగా కూర్చొన్నారు. మొత్తం 90 శాతం పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు, కార్యకర్తలే బీజేపీ ఏజెంట్ల పాత్ర పోషించారు.
► గోపవరం మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి సుధాకర్‌రెడ్డి ఎస్.రామాపురం పోలింగ్ బూత్ 268లో బీజేపీ ఏజెంటుగా కూర్చున్నారు.
► గోపవరం ఎంపీపీ గోపిదేశి ధనలక్ష్మి భర్త కొండయ్య ఎస్.రామాపురంలోని మరో బూత్‌లో బీజేపీ ఏజెంట్ అవతారమెత్తారు.
► చిన్నగోపవరం అంగన్‌వాడీ కార్యకర్త భర్త అదే గ్రామంలోని పోలింగ్ బూత్‌లో బీజేపీ తరఫున ఏజెంట్‌గా కూర్చున్నారు. కాలువపల్లెలో టీడీపీ సర్పంచ్ పసుపులేటి శ్రీనివాసులు అక్కడి బూత్‌లో బీజేపీ తరపున పనిచేశారు.
► బి.కోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి స్వయాన సోదరుడి కుమారుడు మున్నెళ్లిలో, గుంతపల్లిలో టీడీపీ నేత సుబ్బారెడ్డి తమ్ముడి కుమారుడు, చిన్నాన్న కొడుకులు గుంతపల్లి, బి.కోడూరులలో బీజేపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారు.
► కలసపాడు మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు గోపవరం వెంకట్రామిరెడ్డి చిన్నాన్న కుమారుడు రాజారెడ్డి కలసపాడు పోలింగ్ బూత్ 18లో ఏజెంటుగా పనిచేశారు. మొత్తంగా నియోజకవర్గంలోని 90 శాతం పోలింగ్ బూత్‌లలో టీడీపీ వారే బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం విమర్శలకు ఆస్కారం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment