
సాక్షి, తాడేపల్లి: సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ విధింపుతో పాటు తిరుమల వెళ్లకుండా తమ పార్టీ నేతలకు నోటీసులు, హౌజ్ అరెస్టులు చేస్తుండడంపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంటోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణకు దిగింది.
తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది. అంతేకాదు.. తిరుపతిలో జగన్‌పై దాడి చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేసింది.

‘తిరుపతిలో వైఎస్ జగన్‌పై దాడికి కుట్ర!. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ శుక్రవారం తిరుమల చేరుకోనున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్‌పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేసినట్టు సమాచారం. బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి, జనసేన కిరణ్ రాయల్, టీడీపీ నేతలు కలిసి.. గూండాలను పురిగొల్పుతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను కూడా పురమాయించినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ విషయంలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు?’ అని కామెంట్స్ చేసింది.
వైఎస్ జగన్ తిరుమల వెళ్తున్న సందర్భంగా ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌజ్ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతలనూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డిక్లరేషన్ పేరుతో డ్రామాలు ఎందుకు?: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment