![TDP Chandrababu Issued Key Orders To Kesineni Nani - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/5/Kesineni-Nani.jpg.webp?itok=l7H-HJWV)
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. నానికి చంద్రబాబు గట్టి షాకిచ్చాడు. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.
ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment