అధికారం కోల్పోయామన్న ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. పద్నాలుగేళ్లు పదవిలో ఉండి ఏమీ చేయలేక పోయామన్న బాధ రెట్టింపు అవుతోంది. అందుకే తెలుగుదేశం పార్టీ పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టేందుకు కాలుదువ్వుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను పావుగా వాడుకుని విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమవుతోంది. అర్హత లేకపోయినా తాము సూచించిన సర్టిఫికెట్లు అభ్యర్థులకిచ్చేయాలని అధికారులకు హుకుం జారీచేస్తోంది. లేదంటే తమకనుకూలంగా ఉన్న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగుతోంది. ఆ పార్టీ నేతలకు ఎలా నచ్చజెప్పాలో తెలియక.. దొంగసర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించలేక అధికారులు కుమిలిపోవాల్సి వస్తోంది.
సాక్షి, తిరుపతి: పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బెదిరింపులకు దిగుతోంది. టీడీపీ సానుభూతిపరులు ఎన్నికల్లో రచ్చ చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ పర్వం మొదలైన నాటి నుంచే అర్హత లేకపోయినా కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తాము చెప్పిన వ్యక్తికి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఉద్యోగం నుంచి పీకించేస్తామంటూ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది.
(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు..)
ఇవిగో ఆధారాలు
పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె పంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ పంచాయతీలో బీసీ మహిళ ఒక్కరే ఉన్నారు. ఆమె పేరు ఖాదర్‌బి. మిగిలిన ఓటర్లంతా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఖాదర్‌బి ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. అయితే టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చెలికం పాపిరెడ్డి ఎన్నికలు నిర్వహించాలని కుట్రలు పన్నుతున్నారు. ఎస్సీ అయిన యానాది సింధు, రామక్కను బీసీగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
(చదవండి: గ్రామ కక్షలకు టీడీపీ కుట్ర..)
ఆ ఇద్దరూ కన్వర్టెడ్ క్రిస్టియన్లు. అయినా వారికి బీసీ కులధ్రువీకరణ పత్రం ఇప్పించి నామినేషన్ వేయించాలని స్థానిక తహసీల్దార్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. పుంగనూరులో టీడీపీ అభ్యరి్థకి నోడ్యూస్ సరి్టఫికెట్ ఇవ్వలేదని అనీషారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి స్థానిక ఎంపీడీఓపై చిందులేశారు. పన్ను బకాయి ఉన్నా సర్టిఫికెట్ ఇచ్చేయాల్సిందేనని బెదిరింపులకు దిగారు. వి.కోటలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి బహిరంగంగా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
రెచ్చగొట్టి.. షేర్‌చేసి..
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు రకరకాల కుట్రలు, కుతంత్రాలకు తెరదీశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి రెచ్చగొడుతున్నారు. ఆ మాటలను రికార్డు చేసి సోషల్ మీడియా, వారి పార్టీ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ తరువాత ఎన్నికల కమిషన్‌కు పంపుతున్నారు. రెండు రోజుల క్రితం కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి రెచ్చగొట్టారు. ఆపై రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో, టీడీపీ గ్రూపులో షేర్‌చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీకి అనుకూలంగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ గ్రామస్థాయి నాయకులే చెబుతున్నా ఆ పార్టీ జిల్లా స్థాయి నాయకులు వినిపించుకోవడం లేదు. పల్లెల్లో చిచ్చుపెడుతూ రాక్షసానందం పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment