జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ తెలంగాణలో ఎప్పుడో జెండా ఎత్తేసింది. గత ఎన్నికల్లో గెలిచిన ఒకరిద్దరు కారులో ఎక్కేశారు. మొత్తం పార్టీ ముక్క చెక్కలయింది. నాయకులంతా తలో దిక్కు వెళ్లి పోయారు. అయితే ఖమ్మం జిల్లాలో ఇంకా బలం ఉందనే భ్రమల్లో ఉండిపోయారు పచ్చ పార్టీ నాయకులు. అందుకే తెలంగాణలో పార్టీని తిరిగి బతికిస్తామని బీరాలు పలుకుతున్నారు. మరి తెలంగాణలో అసలు సైకిల్ పార్టీ ఉందా?
రండి.. మా పరువు కాపాడండి
రండి బాబూ రండి.. ఆలసించిన ఆశాభంగం అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలంగాణలో రాబోయే రోజు మనవే అని ఊరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది సైకిల్ పార్టీయే అంటూ జోకులు పేలుస్తున్నారు. విరిగిపోయిన సైకిల్ పార్టీకి రిపేర్ చేయడానికి ఈ నెల 21న ఖమ్మం నగరంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు పచ్చ పార్టీ నాయకులు. బహిరంగ సభకు జనాన్ని సమీకరించడానికి రెండు వారాలుగా నానా పాట్లు పడుతున్నారట. మరి సభకు ఎంతమంది వస్తారో.. ఎక్కడి నుంచి వస్తారో చూడాలి..
తుమ్మలపై కోటి ఆశలు
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రసంగించే ఈ సభలో ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతల్ని చేర్చుకోవడానికి ప్లాన్ చేశారట. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. నాయకులంతా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సెట్ అయిపోయారు. ఇప్పుడు వారెవరూ తిరిగి సైకిల్ ఎక్కే ఛాన్స్ అయితే లేదు. అయితే ఖమ్మం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తుందనే ప్రచారం సాగుతోంది.
కాని ఒక్క జిల్లాలో టీడీపీకి మద్దతిస్తే మిగిలిన రాష్ట్రం సంగతేంటి? బీఆర్ఎస్ నాయకత్వం పట్టించుకోవడంలేదనే కోపంతో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలోకి వస్తారంటూ ఈ మధ్యన ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే ఆయన కూడా అలాంటిదేమీ లేదని.. కేసీఆర్ నాయకత్వం నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదని తేల్చేశారు.
వాస్తవానికి బీఆర్ఎస్‌లో ఇమడలేని నాయకులు, నాయకత్వం మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు ఇక్కడే ఉన్న బీజేపీలోకో..లేక కాంగ్రెస్‌లోకో వెళతారు గాని.. పక్క రాష్ట్రం పార్టీలోకి వెళతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా కారు దిగాలనుకుంటున్న నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గాని.. టీడీపీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు ఎవరి గురించి మాటే లేదు.
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పేరు ఎత్తడానికే నాయకులు ఇష్టపడటంలేదు. అటువంటపుడు ఆ పార్టీలో చేరడానికి ఎవరు ముందుకు వస్తారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా గాని టీడీపీలో మాత్రం చేరనని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. తెలంగాణలో అంతో ఇంతో బలం ఉన్న ఖమ్మం జిల్లాలోనే టీడీపీలో చేరడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ఇతర జిల్లాల్లో ఆ పేరు పలకడానికైనా ఎవరైనా సాహసిస్తారా అనే చర్చ సాగుతోంది.
చదవండి: చంద్రబాబు ‘ముందస్తు’ డ్రామా.. ఆ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీలోని నేతలు, కార్యకర్తలంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. సైకల్ రిపేర్ చేయడానికి వీల్లేని విధంగా ముక్కలైపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా రీ ఎంట్రీ ఇచ్చి సైకిల్‌ను రిపేర్ చేసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. పునర్వైభవ పోరాటం... ఆత్మగౌరవ ఆరాటం లాంటి బారీ ట్యాగ్ లైన్లతో ప్రచారం చేసుకుంటోంది. మరి ఈ నెల 21న జరిగే చంద్రబాబు సభ ఎలా జరుగుతుందో.. ఎంత మంది వస్తారో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment