సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ రానున్న ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కోగలిగిన నాయకత్వమే కనిపించడంలేదు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతుండటంతో అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్‌కి పంక్చర్లు పడ్డాయి. మీకు మంచి జరిగిందని భావించినట్లయితేనే మాకు ఓటేయండనే ఆత్మ విశ్వాసంతో గడప గడపకు వెళ్లిన వైఎస్సార్‌సీపీని ఏ రీతిన ఎదుర్కోవాలో తెలియక టీడీపీ తల్లడిల్లుతోంది.
టీడీపీకి నో లీడర్..
ఇదే సమయంలో ‘వై నాట్’ 175’ అనే జగన్ నినాదం చంద్రబాబు బృందానికి గుండెల్లో గునపంలా గుచ్చుకుంటోంది. జనరంజక పాలన సాగిస్తున్న జగన్ ఈ పర్యాయం అన్ని నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగరేస్తామనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి గట్టి నాయకులే దొరకడంలేదు. ఓటమి భయంతో టీడీపీ తరపున పోటీ చేయడానికి నాయకులు వెనుకాడుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని యాభై నియోజకవర్గాల్లో 2009 నుంచి టీడీపీ వరుసగా పరాజయం పాలవుతోంది. గత 2019 ఎన్నికలతోపాటు విభజిత రాష్ట్రానికి 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది. అంతకు ముందు 2009 ఎన్నికల్లోనూ ఇవే నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేతిలో టీడీపీ ఓటమి పాలైంది.
సైకిల్ పంక్చర్..
ఈ హ్యాట్రిక్ పరాజయాలతో ఆ స్థానాల్లో పోటీకి ఎవరు వస్తారో కూడా తెలియని స్థితిలో టీడీపీ ఉంది. ఇక్కడ ఎవరిని రంగంలోకి దించాలని కొట్టుమిట్టాడుతోంది. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగినా ఇక్కడ చంద్రబాబు పప్పులు ఉడకలేదు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డిని ఢీకొనేందుకు వివిధ పార్టీలతో జట్టుకట్టినా ఉపయోగం లేకపోయింది. ఆ తరువాతి ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసినా వైఎస్సార్‌సీపీని టీడీపీ ఎదుర్కోలేకపోయింది. ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లో సైకిల్ పంక్చరయ్యింది. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గెలుపొంది ఆ తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకుని పోటీ చేసిన వారిని ఆ నియోజకవర్గాల ఓటర్లు ఛీకొట్టారు. ఈ యాభై స్థానాల్లో మూడు పర్యాయాలే కాదు అంతకుముందు కూడా టీడీపీ ఓటమిని చవిచూసింది. వీటిలోనే పీఆర్‌పీ, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినవి కూడా ఉండటం గమనార్హం.
బాబు సొంత జిల్లాలోనే..
చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరులోని ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. చంద్రగిరి స్థానంలో 1999తో పాటు ఆ తరువాత జరిగిన ఏ సాధారణ ఎన్నికల్లోనూ సైకిల్ గెలిచిందే లేదు.
వైఎస్సార్‌లో వైఎస్సార్‌సీపీ జయకేతనం
ఓ పక్క చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పార్టీ ఓడిపోతుంటే.. మరోపక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్‌సీపీదే హవా. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ వరుసగా విజయం సాధిస్తోంది. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోనూ వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్‌దే పట్టు.
టీడీపీ వరుస ఓటమి చెందిన స్థానాలివే..
రాజాం, పాలకొండ, పాతపట్నం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, పాడేరు, రంపచోడవరం, తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్తపేట, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, బద్వేలు, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, నందికొట్కూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, ఆలూరు, జి.డి.నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు.
టీడీపీ గెలుపు ఈ స్థానాల్లో..
గత మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలిచింది 8 స్థానాల్లోనే. కుప్పం, హిందూపురం, గన్నవరం, ఉండి, రాజమండ్రి రూరల్, మండపేట, విశాఖ ఈస్ట్, ఇచ్ఛాపురం స్థానాల్లోనే టీడీపీ నెగ్గింది.
ఇది కూడా చదవండి: హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment