నిమ్మాడలో కలమట వెంకటరమణతో అచ్చెన్నాయుడు మాటామంతీ, మధ్యలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేను పార్టీ ఆఫీస్‌లో ఉన్నాను.. వాడు(మామిడి గోవిందరావు) వచ్చి చంద్రబాబు నాయుడుకు ఒక చెక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అది తీసుకున్నాడు. చెక్కు కాదు వాడు ఆస్తి రాసి ఇమ్మను. పార్టీ వాడుకుంటుంది. మామిడి గోవిందరావుకు టిక్కెట్ ఆలోచన ఎందుకు. కలలో కూడా అది ఉహిస్తారా...’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వాఖ్యలివి. ఒక పార్టీ నాయకుడిని పట్టుకుని ‘వాడు’ అంటూ సంబోధిస్తూ మాట్లాడిన ఆయన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి టీడీపీలో ఎవరినైనా వాడుకుని, వదిలేస్తారనే చర్చ నడుస్తోంది.
చదవండి: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
డబుల్ గేమ్..
పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందనే విధంగా మామిడి గోవిందరావు పనిచేసుకుంటున్నారు. తరచూ పార్టీలు మారుతున్నా 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి, మళ్లీ టీడీపీలోకి వచ్చిన కారణంగానే తనకు తప్పనిసరిగా టిక్కెట్ ఇస్తారన్న నమ్మకంతో కలమట వెంకటరమణ ఉన్నారు. కాకపోతే, పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా మామిడి గోవిందరావు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. ప్రతి చోటా తనకే టిక్కెట్ వస్తుందన్న విషయాన్ని చెప్పుకుంటున్నారు. మామిడి ప్రచార దూకుడు, వ్యూహాత్మక అడుగులను తట్టుకోలేక, అభద్రతా భావంతో కలమట వెంకటరమణ గత కొన్నాళ్లుగా టీడీపీలో స్తబ్ధుగా ఉంటున్నారు. ఆ మధ్య జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు.
అయితే మామిడి గోవిందరావు వెనక అచ్చెన్నాయుడు ఉన్నారనే అనుమానం కలమటలో మొదలైంది. ఆయన అండతోనే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారనే అభిప్రాయం కలమటలో నాటుకుపోయింది. దీంతో ఏదో ఒకటి తేల్చుకోవాల న్న ఉద్దేశంతో బుధవారం అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహనాయుడు వద్ద తన విషయాన్ని ప్రస్తావించారు. ‘మీరు లేనప్పుడు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ఇద్దరి దగ్గరే మా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నా’నంటూ తన మనసులో ఉన్న ఆవేదన, అక్కసు, అభద్రతను కలమట వెంకటరమణ వ్యక్తం చేశారు.
దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ‘అసలా ఆలోచన ఎందుకు రావాలి? మొన్న కూడా అదే చెప్పాను. ఎందుకు అభద్రతా భావం. కలలో కూడా ఆలోచన లేదు. నా ప్రయత్నం ఏమిటంటే వాడు కూడా నీకు ఉపయోగపడతాడని, నీ చేతిలో పెట్టాల ని నా ప్రయత్నం. నా ఆలోచన అదే. నేననేది వాడు చేయకపోయినా ఫర్వాలేదు. మన వెనక తిరిగినట్టు ఉంటే కొంత... ఆ మెసేజ్ వెళతాది కదా?’ అంటూ చమత్కారంగా చెప్పుకొచ్చారు. ‘చంద్రబాబుకు చెక్ ఇచ్చాడు... తీసుకున్నాం... తర్వాత చెక్ కాదు కదా ఆస్తి రాసిచ్చినా పార్టీకి వాడుకుంటాం...’ అంటూ వాడుకోవాలన్నదే మన ఉద్దేశమని స్పష్టంగా కలమటకు చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలు ఆడియో, వీడియోతో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అచ్చె న్న డబుల్ గేమ్ అడుతున్నారని.. పార్టీకి పనిచేసినోళ్లందరినీ వాడుకోవడానికే తప్ప మరే దానికి కాదని ఈ వీడియో క్లిప్పింగ్ చూశాక టీడీపీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment