భువనేశ్వరి ప్రసంగిస్తుండగా సభ నుంచి వెళ్లిపోతున్న మహిళలు
తిరుపతి సిటీ/సాక్షి, తిరుపతి: తిరుపతిలోనే పుట్టి తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన వ్యక్తిని ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రేణిగుంట రోడ్డులో గురువారం ‘నిజం గెలవాలి’పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. తిరుపతి నేడు అభివృద్ధిలో ముందుకు సాగుతోందంటే దానికి చంద్రబాబు కృషే కారణమన్నారు. ఏపీకి రావాల్సిన ఫ్యాక్టరీలు ఈ ప్రభుత్వం దుశ్చర్యల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు. అమర్‌రాజా, టీసీఎల్ వంటి అత్యున్నత సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చెప్పారు.
అవినీతి ఆరోపణలు లేకున్నా.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు నిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్నారంటూ పలువురు కేంద్ర నేతలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిజమే గెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. కాగా, తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభకు జనసేన ప్రధాన నేతలు ముఖం చాటేశారు.
కనీసం ఆ పార్టీ జెండాలు కూడా సభలో కనిపించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు మహిళలను సభకు తరలించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.300 చెల్లించి ఆటోలు, వ్యాన్లతో తరలించారు. భువనేశ్వరి ప్రసంగిస్తుండగా సభ నుంచి వారు నిష్క్రమించడం కనిపించింది.
టీడీపీ ముఖ్యనేతలకు ఘోర అవమానం
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండో రోజే టీడీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం నడచుకున్న ఇన్‌చార్జ్‌లు.. జిల్లా నేతలను పూర్తిగా పక్కనపెట్టారు. వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయారు. తిరుపతి సభలో ముందు వరుసలో కూర్చున్న మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌లను లేపి వెనక్కు పంపేశారు.
తీవ్ర అవమాన భారాన్ని తట్టుకోలేక వారు అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు, రాబిన్‌శర్మ టీం, ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు రాంభూపాల్‌రెడ్డి, అనూరాధలపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న తపనతో స్థానికులు రాకున్నా.. టీడీపీ నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సభకు రప్పించుకున్నారు. అయినా సభ విజయవంతం కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
భువనేశ్వరి ప్రసంగించేటప్పుడు కన్నీరు పెట్టుకోవాలని చంద్రబాబు, రాబిన్ శర్మ టీం సూచించినట్టు తెలిసింది. అలాగే భువనేశ్వరి మాట్లాడేటప్పుడు సభలోని వారు సైతం కన్నీరు మున్నీరు కావాలని.. ఆ మేరకు పలువురుకి శిక్షణ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయినా ఎవరూ కన్నీరు పెట్టకపోవడం విశేషం. రెండో రోజైనా జనాన్ని మభ్యపెట్టాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. ఎంపిక చేసిన వారితో మాట్లాడించారు. అయినా జనం వీరి ప్రసంగాలను నమ్మలేదు.
Comments
Please login to add a commentAdd a comment