
పోడియం వద్దకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు అడ్డుగా ఉన్న మార్షల్స్
సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని ఎలాగైనా సరే నిజమని నమ్మించడానికి టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. శాసనసభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బయట ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తూ దిగజారి వ్యవహరిస్తున్నారు. తమ ప్రయత్నంతో కొంత మంది ప్రజలనైనా నమ్మించాలనే వ్యూహంతో సాధారణ మరణాలను కల్తీ మద్యం మరణాలుగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేస్తున్నారు. శాసనసభలో 9వ రోజు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు రభస సృష్టించారు. సినిమా హాల్‌ను తలపించేలా విజిల్ ఊదుతూ.. బల్లలపై పుస్తకాలతో గట్టిగా చరుస్తూ గందరగోళం సృష్టించారు. సభను అడ్డుకోవద్దని సూచించిన స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను అవమాన పరిచేలా వ్యవహరించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ సభ్యులను కవ్వించేందుకు ప్రయత్నించారు.
సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఫ్ల కార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం మెట్లపైకి ఎక్కి కల్తీ సారాపై విచారణ చేయాలంటూ అరవడం ప్రారంభించారు. అయినా అధికార పార్టీ సభ్యులు, మంత్రులు ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో ఇంకా రెచ్చిపోయి నినాదాలు చేశారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదే పదే వారిని తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు.
ఎంత చెప్పినా వినకపోవడంతో గంట సేపటి తర్వాత స్పీకర్ మార్షల్స్‌ను పిలిచి వారిని బయటకు పంపించాలని చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం మెట్ల నుంచి దిగి, వారి స్థానాల వద్ద నిలబడ్డారు. అక్కడ కూడా నినాదాలు చేస్తూ సభ జరక్కుండా అడ్డుకోవాలని చూశారు. ఎంత వారించినా వినకపోవడంతో కొద్దిసేపటి తర్వాత.. అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజులను ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆ నలుగురితోపాటు మిగిలిన టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
బరితెగించి మరీ అల్లరి..
సస్పెండ్ కాని టీడీపీ సభ్యులు అరగంట తర్వాత మళ్లీ సభలోకి వచ్చారు. చర్చ జరుగుతున్న సమయంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తాను వెంట తెచ్చుకున్న విజిల్‌తో ఊదుతూ అంతరాయం కలిగించారు. దీంతో స్పీకర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే పనిగా విజిల్ ఊదారు. ఎంత అల్లరి చేసినా ఇంత వరకు భరించానని, దేనికైనా ఒక హద్దు ఉంటుందని స్పీకర్ మండిపడ్డారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు స్పీకర్‌కు వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. స్పీకరే సరిగా వ్యవహరించడం లేదని, తాము గౌరవంగానే ఉంటున్నామని వాదించారు. ఈ సమయంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సభను అడ్డుకోవడానికి విజిల్స్ తెచ్చారని, ఆయుధాలు కూడా ఏమైనా తెచ్చారేమో చూడాలన్నారు.
శాసనసభలో విజిల్ వేయడం ఏమిటని, 23 మంది ఎమ్మెల్యేలుంటే 9 మంది సభకు వచ్చి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను ‘నువ్వు’ అని సంబోధించడం ఏమిటని కొరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. సినిమా హాలులో వ్యవహరించినట్లు టీడీపీ సభ్యులు చిల్లర వేషాలు వేస్తున్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు గొడవ మానకపోవడంతో స్పీకర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చాలా సంయమనంగా వ్యవహరించానని, దాన్ని అలుసుగా తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభలో విజిల్ వేసిన గద్దె రామ్మోహన్, గొడవ చేస్తున్న ఏలూరి సాంబశివరావును ఈ సమావేశాల వరకు, మిగిలిన సభ్యుల్ని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.