తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం  | TDP membership dropped to 21 lakh | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం 

Published Sun, Jun 11 2023 4:20 AM | Last Updated on Sun, Jun 11 2023 7:22 AM

TDP membership dropped to 21 lakh - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకి పెరుగుతోందని, పసుపు సైన్యం 70 లక్షలంటూ చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కొట్టుకుంటున్న డప్పంతా ఉత్తిదే అని తేలిపోయింది. టీడీపీ గ్రాఫ్‌ పెరగకపోగా పాతాళంలోకి పడిపోతోందని తేటతెల్లమైంది. ఇందుకు ఆ పార్టీ సభ్యత్వ నమోదే  తిరుగులేని రుజువు. పార్టీ సభ్యత్వం 21 లక్షలకు చేరుకుందని స్వయంగా చంద్రబాబే  శుక్రవారం జరిగిన ఐ–టీడీపీ సదస్సులో ప్రకటించారు. దీన్నే గొప్పగా చిత్రీకరించే ప్రయ­త్నం చేశారు.

కానీ గతంతో పోల్చుకుంటే సభ్యత్వం 70 శాతా­నికిపైగా పడిపోయింది. అందుకే ఎక్కడా ఈ మధ్య సభ్యత్వ నమోదు ఊసే వినపడడంలేదు. ఐ–టీడీసీ సదస్సులో చంద్రబాబు నోరు జారి అస­లు సభ్యత్వాన్ని బయట పెట్టేశారు. దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ­కి లేనంత పసుపు సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని గతంలో చంద్రబాబు పదే పదే చెప్పుకునేవారు.
చదవండి: Fact Check: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ?

అమెరికా సైన్యాన్ని మించి టీడీపీ సభ్యులు ఉన్నారని ఆయన తనయుడు లోకేశ్‌ గొప్పగా ప్రకటించుకున్నారు. ఇటీవల లోకేశ్‌ పాదయాత్రలో కూడా 70 లక్షల సైన్యం గురించి ప్రస్తావించారు. ఇప్పుడు అసలు సంఖ్యని చంద్రబాబే చెప్పడంతో ఇన్నాళ్లూ చెబుతున్నవన్నీ కాకమ్మ కబుర్లేనని తేలిపోయింది. 

ఎన్టీఆర్‌ శతజయంతి పేరు చెప్పినా పెరగలేదు 
ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఈ ఏడాది సభ్యత్వాలు 70 లక్షల­కు మించాలని ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వారి బంధువులు, మేధావులు, విద్యావంతులు, ఎన్నారైలు, వివిధ వర్గాల ప్రజలతో సభ్యత్వం చేయించాలని చంద్రబాబు క్యాడర్‌కు నిర్దేశించారు. నియోజకవర్గాలకు రేటింగ్‌ ఇస్తామని ఇన్‌ఛార్జిలను మభ్యపెట్టారు. చివరికి సభ్యత్వ నమోదులో వెనుకబడిన వారికి సీట్లు ఇవ్వబోమని భయపెట్టారు. అయినా ఉపయోగంలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు, పార్టీ ఇన్‌చార్జిలు ఎంత కష్టపడినా వందల సంఖ్యలోనే సభ్యత్వం జరిగింది. 

కుప్పం, మంగళగిరిలోనూ అంతే 
చంద్రబాబు  ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేశ్‌ ఇన్‌చార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గాల్లోనూ టీడీపీ సభ్యత్వం అంతంతమాత్రమేనని టీడీపీ నేతతే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదును మధ్యలోనే నిలిపివేశారు. చంద్రబాబుపై నమ్మకం లేకపోవడం, మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశలు లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా గడప గడపకు అందుతుండటం కూడా టీడీపీ సభ్యత్వ నమోదుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

2019 నుంచి పెరగని సభ్యత్వాలు 
2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచే ఆ పార్టీ సభ్యత్వం రాకెట్‌ వేగంతో పడిపోయింది. ప్రతి ఏడాది మహానాడుకు ముందు గ్రామస్థాయి నుంచి భారీగా సభ్యత్వ నమోదు చేసేవారు. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సభ్యుల సంఖ్యను ప్రకటించేవారు. చివరిగా మహానాడులో చంద్రబాబు సభ్యత్వ వివరాలను ఘనంగా వెల్లడించేవారు. కానీ అధికారం పోయినప్పటి నుంచి నాలుగేళ్లుగా సభ్యత్వాలు పాతాళానికి దిగజారిపోయాయి. దీంతో మహానాడులో సభ్యత్వాల టాపిక్‌నే లేపేశారు.

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడంతో టీడీపీ బలం పెరిగిపోయిందనే భ్రమలో ఈ సంవత్సరం మహానాడుకు ముందు సభ్యత్వ నమోదు ప్రారంభించారు. గతంలోలా ఉవ్వెత్తున సంఖ్య పెరిగిపోతుందని భావించారు. కానీ అది 21 లక్షలు కూడా దాటలేదు.

ఈ సంఖ్యపైనా పార్టీ నేతల్లోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో సభ్యత్వాలు 15 లక్షలు కూడా ఉండవని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిగతావి ఐ–టీడీపీ, సీబీఎన్‌ ఆర్మీ వంటి టీడీపీ సోషల్‌ మీడియా విభాగాలు, ఎన్నారైల ద్వారా ఆన్‌లైన్‌లో వచి్చనట్లు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement