వలంటీర్ల పేరుతో టీడీపీ కొత్త మోసం
కొత్త వలంటీర్లంటూ కొందరు యువకులను ఇంటింటికీ పంపిస్తున్న టీడీపీ
టీడీపీకి ఓటు వేయాలని వారి ద్వారా ప్రలోభాలు
చిత్తూరు రూరల్‌లో వెలుగులోకి నయా మోసం
చిత్తూరు రూరల్(కాణిపాకం): కొత్త వలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందిన కొందరు యువకులను గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలామంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లుగా మిమ్మల్నే నియమిస్తామని నమ్మబలికారు. వారికి వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున పంపించారు. ఇక వారు పేదల ఇళ్లకు వెళ్లి ‘తాము కొత్త వలంటీర్లం. ఇక వచ్చేది టీడీపీ. కాబట్టి టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే ఏ పథకం రాదు..’ అని బెదిరిస్తున్నారు.
టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం.. అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలను నమ్మరాదన్న భావనను వారు వెలిబుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment