
పోడియం ఎక్కి స్పీకర్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: గొడవ చేయడం ద్వారా త్వరగా సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోయేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం కూడా హంగామా చేశారు. రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంలో ఉందనే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. దానిపై చర్చకు అనుమతించాలని ఆ పార్టీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంతో వాగ్వాదానికి దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువసేపు మాట్లాడినా స్పీకర్ అనుమతించారు.
అధికార పార్టీ సభ్యులు కూడా ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేయలేదు. విద్య, వైద్యం–నాడు నేడుపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైన వెంటనే తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. సంక్షేమం సంక్షోభంలో పడిందని, సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేశారని నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు. కొందరు సభ్యులు పోడియంపైకి ఎక్కి స్పీకర్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అచ్చెన్నాయుడు తదితరులు పోడియంను గుద్దుతూ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. సభలో అధికార పార్టీ సభ్యుల ప్రసంగాలు వినపడకుండా ఉండేందుకు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించానని, ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చుని స్వల్పకాలిక చర్చలో పాల్గొనాలని స్పీకర్ ఎంత కోరినా వారు పట్టించుకోలేదు. కొందరు ప్లకార్డులను స్పీకర్ మొహానికి అడ్డుగాపెట్టి అతిగా ప్రవర్తించారు.
వారి ప్రవర్తన శృతిమించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామిలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
ఆ తర్వాత కూడా వారు సభ నుంచి బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తుండడంతో సభాపతి మార్షల్స్‌ను పిలిచారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు తాము ప్రదర్శించిన ప్లకార్డులను ముక్కలుగా చించి మార్షల్స్‌పై విసిరారు. చివరికి అధికార పార్టీ సభ్యులపై కామెంట్లు చేస్తూ
బయటకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment