సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని, వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని నిర్ధారణకు వచ్చే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటి నుంచే ఓటమికి సాకులు వెదుక్కుంటున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అందుకే అత్యంత పారదర్శక పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వంపై బురదజల్లుతూ తనకు వత్తాసుపలికే ఎల్లో మీడియాతో అభూతకల్పనలతో కథనాల్ని రాయించడం, వాటిపైనే టీడీపీ నేతలతో మరోమారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడిస్తున్నాడని విమర్శించారు.
మేధావుల సంఘాలంటూ ఊరూపేరులేని వ్యక్తుల్ని తీసుకొచ్చి వారికి ఏవో పదవుల్ని తగిలించి ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పి, వారి నోటిమాటల్ని ప్రజాభిప్రాయంగా చిత్రీకరించాలనే చంద్రబాబు ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో నాలుగున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపారని వివరించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల ప్రభావంతో వేలమంది చనిపోయారని, ఆ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలంటే గతంలో పిల్లనిచ్చే పరిస్థితి లేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ఉద్దానానికి ఏమీ చేయలేదని, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఆ ప్రాంతంలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు పెట్టిస్తానంటూ గతంలో పెద్దపెద్ద కోతలు కోసి, చివరికి ఏమీ చేయకుండా చేతులెత్తేశాడని విమర్శించారు. దాదాపు రూ.800 కోట్లు ఖర్చుపెట్టి కిడ్నీ రీసెర్చి సెంటర్‌తోపాటు మంచినీటి శుద్ధి ప్లాంట్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ప్రారంభించడం ద్వారా ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరిస్తే.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు నోటమాట రావడంలేదని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
ఏపీకి వారు అతిథులు
♦ 3నెలల్లో అధికారంలోకి వస్తానంటూ చంకలు చరుస్తున్న చంద్రబాబుకు మతితప్పిందేమో! ప్రజామోదంతో అభ్యర్థుల్ని ఎంపిక చేస్తానంటున్నాడు. అసలు చంద్రబాబుకే ప్రజామోదం లేనప్పుడు.. ఆయన ఎంపికచేసే అభ్యర్థులను ఏ ఒక్కరూ ఆమోదించరనే సంగతి గ్రహిస్తే మంచిది. నిజానికి ఆయన్ని 2019లోనే ప్రజలు తిరస్కరించారు. ప్రజలకు మంచిచేసి ఉంటే.. 2019లో 23 సీట్లకు టీడీపీని ఎందుకు పరిమితం చేస్తారు?
♦ గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గమ్మగుడిలో తాంత్రికపూజలు చేయించినట్లు, ఇప్పుడు కూడా ఎక్కడైనా చేతబడుల్లాంటి తాంత్రికపూజలు చేయిస్తున్నాడేమో? వాటిమీద నమ్మకంతోనే మూడునెలల్లో అధికారంలోకి వస్తానంటూ మాట్లాడుతున్నాడేమో చూడాలి. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్‌ను, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏమీ పీకలేడని తెలుసుకోవాలి.
♦ తెలంగాణలో తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా గాలికొదిలేశాడు చంద్రబాబు. సొంత కొడుకు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేదు. రాష్ట్రానికి అతిథుల్లా వచ్చి రాజకీయం చేస్తున్నారు. జగన్‌ను ప్రజలు వద్దంటున్నారని చంద్రబాబు ఎలా చెబుతాడు?
♦ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను మారిస్తే చంద్రబాబుకు నొప్పేంటి? అసలు.. నువ్వు చంద్రగిరిని వదిలి బీసీ స్థానమైన కుప్పానికి ఎందుకు వలస వెళ్లావ్? నీ కొడుకు బీసీ స్థానమైన మంగళగిరికి ఎందుకు వలస పోయారు? నీ వియ్యంకుడు బాలకృష్ణకు హిందూపురంతో ఏం సంబంధం ఉందని అక్కడ పోటీచేస్తున్నారు బాబూ? మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెడుతుంటే.. టీడీపీ తరఫున లోకేశ్ పోటీచేయడానికి సిగ్గుండాలి కదా?
♦ విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలనేది సీఎం జగన్ అభిమతం. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేల పనితీరుపై అధికారంలోకొచ్చిన ఏడాది తర్వాత నుంచి జగన్ చెబుతూనే ఉన్నారు. రేపటి ఎన్నికలకు సంబంధించి ప్రజల మేలు కోసం సమర్థమైన నాయకులతో బరిలోకి దిగబోతున్నాం. అందుకే, ఫర్ఫెక్ట్ టీమ్ కోసం కసరత్తు చేస్తున్నాం. మా పార్టీలో ఎమ్మెల్యే పదవులు, పార్టీ పదవులు రెండు సమానమే.
♦తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం భేషైన చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని, రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి లేఖ రాస్తాడా? అసలు మతి ఉండే లేఖ రాశాడా? పంటనష్టం అంచనాపై ఆయనెలా లెక్కలేస్తాడు? నేనడిగితే కేంద్రం స్పందించిందని చెప్పుకోవడానికే చంద్రబాబు ఆరాటపడుతున్నాడా? బాధ్యతతో పనిచేసే రాజకీయ నాయకుడి లక్షణాలేమైనా బాబుకు ఉన్నాయా? సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యవహరించాల్సింది ఇలాగేనా? ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు పూర్తి చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే.. తప్పుబట్టటానికి ఏ కారణం చూపలేక కేంద్ర ప్రభుత్వానికి లేఖలంటూ నాటకాలాడతావా బాబూ?.
Comments
Please login to add a commentAdd a comment