సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా చర్చనీయాంశంగా మారింది. చెరువుల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్క్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా పనితీరుపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నివాసాలను మాత్రమే టార్గెట్ చేస్తూ హైడ్రా.. కొత్త డ్రామాలకు తెరతీసిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి నగరంలోని చెరువులన్నింటినీ తిరిగి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను ఆక్రమించి కట్టిన కట్టడాల వివరాలను బీజేపీ నేతలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రోజుకు ఒకరు ఒక్కో చెరువును పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణలకు గురైన వివరాలన్నింటినీ హైడ్రాకు అందజేస్తారు. ఇక, వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి పెంచుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. చెరువులను కబ్జా చేసి నిర్మాణం చేసిన భవనాలను కూల్చడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. హైడ్రా పక్షపాత ధోరణిపైనే మాకు అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో దాదాపు పాతిక చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులకు ప్రభుత్వం కట్టబెట్టింది. చెరువు మధ్యలో నుంచే రోడ్ల నిర్మాణం జరిగింది. వీరికి ఎలాంటి నోటీసులు జారీ కాలేదు.
హైడ్రా చిత్తశుద్ధితో పని చేయడం లేదు.
సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారా?. ఒకవేళ ఇచ్చినట్లయితే వాటిని ఇంత వరకు ఎందుకు బహిర్గతం చేయలేదు. మజ్లిస్ నేతల జోలికి వెళ్లడానికి హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి సాహసం లేదా? నానక్‌రామ్‌గూడలో చెరువులను మీనాక్షి బిల్డర్లు, వంశీరాం బిల్డర్లు చెరువులో నిర్మాణాలు చెపట్టారు. వారిపై చర్యలెందుకు లేవని ప్రశ్నించారు. పేదలపై మాత్రమే హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తున్నదని, పెద్దల కబ్జాల వివరాలన్నింటినీ సమర్పించి ఒత్తిడి పెంచుతామని అన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment