సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది.
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు.
అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం.
సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment