వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా జెండా ఎగరేయాలని కమలం పార్టీ ఆశపడుతోంది. అందుకోసం చాలా కష్టపడుతోంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకులే కరువయ్యారు. కొన్ని చోట్ల ఉన్నవారు కూడా యాక్టివ్‌గా లేరు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది?
తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి బీజేపీ నాయకత్వం దూకుడు మీదుంటే.. మెదక్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ నాయకులు నామ మాత్రంగా కూడా స్పందించడం లేదు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆందోల్‌లో మాజీ మంత్రి బాబు మోహన్ కమలం పార్టీలో ఉన్నప్పటికీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వచ్చి వెళ్తున్నారు. పార్టీ కేడర్ యాక్టివ్గా ఉన్నప్పటికీ.. కార్యకర్తలను నడిపించడానికి బలమైన నాయకుడు లేకుండా పోయారు. జహీరాబాద్ నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జంగం గోపిపై సస్పెషన్ వేటు పడింది. దీంతో బీజేపీ కార్నర్ మీటింగ్లు నిర్వహించడానికి నాయకుడే లేకుండా పోయారు.
జిల్లా కేంద్ర నియోజకవర్గం సంగారెడ్డిలో బీజేపీకి కొంత పట్టు ఉంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేశ్ పాండే పార్టీ కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నా.. ఇక్కడ నేతల మధ్య విభేదాలు రగులుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో, విభేదాల కారణంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహించడంలో విఫలం అవుతున్నారు. పఠాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్ లు ఎవరికీ వారే అన్న చందంగా తయారయ్యారు. నారాయణ ఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కూడా అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..?
బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పలు నియోజక వర్గాల నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఉన్న కొద్ది మంది నాయకులు అంతర్గత కలహాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా నాయకులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
నాయకత్వ సమస్యను అధిగమించేందుకు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఆపరేషన్ ఆకర్షపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినప్పటికీ జిల్లాలో పెద్దగా స్పందన రావడంలేదు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళి యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ బీజేపీలో చేరలేదు. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సోదరుడు రాంచందర్ కాషాయ కండువా కప్పుకున్నప్పటికీ ఏ మేరకు ప్రభావం చూపగలరనేది ప్రశ్నార్ధకమే. జిల్లా నాయకత్వం అనుసరిస్తున్న తీరుతోనే పార్టీ అగ్రనేతల కార్యక్రమాలు తరచుగా రద్దవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment