
మీడియాతో మాట్లాడుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ఇబ్రహీంపట్నం: ప్రజల సొమ్ము దోచుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు వికటించి మృత్యువాత పడిన సీతారాంపేటకు చెందిన లావణ్య, లింగంపల్లికి చెందిన సుష్మ కుటుంబ సభ్యులను ఆదివారం సాయంత్రం అయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం డాక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వస్తే నలుగురి ప్రాణాలను తీశారని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఒక్కముక్కా ప్రస్తావించకపోవడం సీఎం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు.
ఇతర రాష్ట్రాలు తిరిగి రైతులకు డబ్బులు ఇచ్చేందుకు, డిల్లీకి వెళ్ళి రాజకీయాలు చేసేందుకు వీలవుతోంది కానీ... ఓట్లు వేసిన ప్రజలు పుట్టెడు శోకంలో ఉంటే వారిని పరామర్శించి, ఆదుకునేందుకు సమయం దొరకడంలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల, పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోన్న ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, ఆపరేషన్లు చేసిన వైద్యులపై, పర్యవేక్షించని సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment