ఈడీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి, జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. రాహుల్ విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలన్న ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సోమవారం నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు పార్టీ జెండాలు చేతబూని పెద్దఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హల్‌చల్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా సోనియా, రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఉదయం 10 గంటల నుంచే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెక్లెస్‌రోడ్డుకు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు గీతారెడ్డి,
మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌అలీ, జెట్టి కుసుమకుమార్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సునీతారావు, బల్మూరి వెంకట్రావు, నూతి శ్రీకాంత్‌గౌడ్, మెట్టు సాయికుమార్‌లతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకుని అక్కడ మూడు గంటలకు పైగా బైఠాయించారు.
కాంగ్రెస్ అంటే భయంతోనే నోటీసులు: రేవంత్‌రెడ్డి
గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కర్లేదని, ఆ కుటుంబం త్యాగాల కుటుంబమని అనేకమార్లు రుజువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈడీ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో ఆయన ప్రసంగిస్తూ రాహుల్, సోని యాలకు కావాలంటే రూ.50లక్షలు కాదని, రూ.5 వేల కోట్లయినా 24 గంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలే సమకూరుస్తారని చెప్పారు.
‘ఇప్పటికే పలు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే అక్రమంగా ఈడీ నోటీసులిచ్చింది. ఏదైనా కేసులో పోలీ స్ స్టేషన్‌కు పిలిపించాలన్నా ఎఫ్‌ఐఆర్ నమోదై ఉం డాలని, నేషనల్ హెరాల్డ్ కేసులో కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా లేకుండానే ఈడీ ఏకంగా విచారణకు పిలిపించడమంటే గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే యత్నమే’అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను ఈడీ విచారణకు పిలిస్తే ఊరుకోని, సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ భయపడదు: భట్టి
సోనియా, రాహుల్ ఈడీ నోటీసులకు భయపడే వ్యక్తులు కాదని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 1980లో ఇందిరాగాంధీని కూడా అక్రమంగా జైలుకు పంపిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసునని, దేశ ప్రజలు అప్పటి జనతాపార్టీకి బుద్ధి చెప్పి ఇందిరాగాంధీని ప్రధానిని చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేంతవరకు పోరాడతామని, రాహుల్, సోనియాలను కాంగ్రెస్ కార్యకర్తలే కాపాడుకుంటామని చెప్పారు.
జగ్గారెడ్డి హల్‌చల్
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హల్‌చల్ చేశారు. అందరికంటే ముందుగా నెక్లెస్‌రోడ్డుకు చేరుకున్న ఆయన చాలాసేపు ఇందిరాగాంధీ విగ్రహం ముందే బైఠాయించి నేతలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం ఫ్లాట్‌ఫారం వరకు ఎలాంటి నిచ్చెనా లేకుండా ఎక్కి తన నిరసన తెలిపారు. బీజేపీ అక్రమాలను ప్రశ్నిస్తూ ప్లకార్డులను ప్రదర్శించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ జెండాను పట్టుకుని కొంతసేపు హల్‌చల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment