
సాక్షి, హైదరాబాద్: ఉప్పుడు బియ్యం సేకరించలేమని తేల్చిచెప్పినా తెలంగాణ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రుల ద్వారా బెదిరించిందంటూ (ధమ్కీ) కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల గోస తీర్చాలంటూ ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులకు ధమ్కీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని దుయ్యబట్టారు.
కేంద్రంతో విభేదించే వారిని ఈడీ, ఐటీ దాడుల పేరిట బెదిరించే సంస్కృతి బీజేపీదేనని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై గోయల్ తెలంగాణ ప్రజలు, రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జాజుల సురేందర్‌తో కలసి శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు.
అవమానాన్ని తెలంగాణ సహించదు
‘‘రైతుల పక్షాన ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడగడం ధమ్కీ కానే కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన కేంద్రాన్ని చేసే డిమాండ్ అవుతుంది. నూకలు తినాలని మీరు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. అన్నం తినో.. అటుకులు బుక్కో 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధించుకున్న మమ్మల్ని నూకలు తినమంటారా? అవసరమైతే నూకలు తింటం.. మిమ్మల్ని గద్దె దించుతం.
తెలం గాణ సమాజం దేన్నయినా సహిస్తది కానీ అవమానాన్ని సహించదు’ అని హరీశ్‌రావు వ్యాఖ్యా నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య రాష్ట్ర పాలకులు ఇక్కడి ప్రజలను హేళన చేసిన రీతిలోనే గోయల్ మాట్లాడుతున్నారని, రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరితే పదేపదే అవ మానిస్తున్నారని ఆక్షేపించారు. ఇందుకు గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ నిబంధనలు అడ్డంకా?
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) 1995లో తెచ్చిన నిబంధనల కారణంగా కేంద్రం వద్ద నిల్వ ఉన్న బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం సాధ్యంకాదని గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉండి కేంద్రం ఏం చేసిందని... డబ్ల్యూటీఓ ఒప్పందాలను మార్చే శక్తి రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? అని నిలదీశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం అందుకు బదులుగా అన్నదాతలపై పెట్టుబడి, ఎరువుల భారాన్ని మాత్రం రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను అవమానించినా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడట్లేదని విమర్శించారు.
పంటల వాతావరణాన్ని కేంద్రం పట్టించుకోవట్లేదు...
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వాతావరణం, పంటల సాగు ఉంటుందనే విషయాన్ని కేంద్రం పట్టించుకోవట్లేదని, తెలంగాణ నుంచే 90 శాతం విత్తనాలు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ‘సబ్‌కా వికాస్’ అంటూ కేంద్రం చేస్తున్న నినాదంలో తెలంగాణ రైతులు ఉన్నారో లేదో వెల్లడించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటికైనా యాసంగి ధాన్యం కొనాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment