సాక్షి, సంగారెడ్డి: రైతుల శాపం తగిలి ఏదోక రోజు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం పతనం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే పాలకులు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. ‘రోజూ ఏదో ఒక మూల రైతు మరణిస్తున్నాడు. రైతు ఆత్మహత్య లేని వార్త దినపత్రికల్లో కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యలను ప్రభుత్వ రికార్డులలో చూపడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు రైతు ఆత్మహత్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. గత శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల’ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ఇదేనా తెలంగాణ అంటే?
‘రైతు చనిపోతే ఈ ప్రభుత్వం స్కీం పెట్టింది.. కానీ బతకడానికి ఎందుకు పెట్టలేదు, అంటే రైతు చనిపోవాలని పథకం పెట్టారా? తెలంగాణ వస్తే.. రైతు ఆత్మహత్యలు ఉండవని కేసీఆర్ వేల సార్లు సభలలో చెప్పారు. అందుకే కావచ్చు.. రైతు ఆత్మహత్యలను రికార్డ్ లోకి ఎక్కించడం లేదు. ఇదేనా రైతు ఆత్మ హత్యలు లేని తెలంగాణ అంటే? ఎందుకు, ఈ ప్రభుత్వం వర్ష కాలంలో సంభవించిన పంట నష్టంపై స్పందించడం లేదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దగ్గరకు వెళ్తారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది ఉందని ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నార’ని ఎద్దేవా చేశారు.
రుణమాఫీ ఊసేలేదు
ఎన్నికల సమయంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నా.. ప్రజలు మమ్మల్ని నమ్మలేదు. టీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ అంది. రెండో సారి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న రుణమాఫీ ఊసేలేదు. టీఆర్ఎస్ పార్టీ రైతులను మభ్యపెడుతూ.. కాలం గడిపేస్తుంది. తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే.. మీరు సిగ్గు పడాలి.. రైతుల శాపం తగిలి ఏదో ఓక రోజు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం పతనం అవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఇలాగే చేస్తే.. రైతులు వ్యవసాయం వదిలి పెట్టే పరిస్థితి వస్తది. ఎకరాకు 20 వేల చొప్పున అన్ని పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి. లేదంటే రెండు, మూడు రోజులలో ప్రగతి భవన్ ముందు సంగారెడ్డి రైతులతో ధర్నా చేస్తా. రైతులకు ఉచిత ఎరువులు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. సీఎం ప్రకటనలు కేవలం బ్రేకింగ్ లకే పరిమితం అవుతుంది. నాగలి దున్నడు, నీళ్ళు పారించడు కానీ పెద్ద రైతు లెక్క కేసీఆర్ మాట్లాడుతడు.. ప్రభుత్వ సూచనల మేరకే రైతులు పంటలు వేసారు. ఇప్పుడు నష్టం పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని జగ్గారెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment