కర్నాటక ఫలితాలతో డీలాపడ్డ కమలం పార్టీకి నాగర్ కర్నూల్ సభ ఊపిరి పోసిందా? తెలంగాణలో అధికారం సాధించాలన్న సంకల్పానికి జేపీ నడ్డా సభ బలం చేకూర్చిందా? చేరికలు లేక, రాష్ట్ర నాయకత్వంలో విభేదాలతో గందరగోళంగా ఉన్న బీజేపీకి పార్టీ చీఫ్ రాకతో జోష్ పెరిగిందా? టీ.బీజేపీకి నాగర్ కర్నూల్ బహిరంగసభ ఇచ్చిన సందేశం ఏంటి?
సీనియర్ నేతలున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కూడా కేడర్‌లో ఊపు తెచ్చింది. పాలమూరు జిల్లా తమకు అత్యంత ముఖ్యమైనదని బీజేపీ పెద్దలు చాటారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పార్టీకి హైప్ తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కేడర్‌లో నిరాశ అలుముకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకురావడానికి పార్టీ పెద్దలు సీరియస్‌గానే ప్రయత్నించారు. కాని ఆయన పాతగూటికే చేరాలని నిర్ణయించుకున్నారు.
కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణలో పార్టీ నేతలు, కేడర్ మీద ప్రభావం చూపించింది. పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. కేడర్ నిస్సత్తువకు గురైంది. మరోవైపు కర్నాటకలో సాధించిన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కర్నాటక సరిహద్దులోనే ఉన్న పాలమూరు జిల్లాలో కచ్చితంగా కాంగ్రెస్ ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవసంకల్ప్ యాత్ర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకు రావడం, ప్రజలు కూడా భారీగా తరలిరావడంతో బీజేపీ కేడర్‌లో ఉత్సాహం ఉప్పొంగింది. తెలంగాణలో పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన ప్రయత్నం పాలమూరు జిల్లాలో మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ విజయాలపై కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడర్ మొత్తం ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర నాయకత్వం సూచించింది.
జిల్లా కేడర్‌లో ఉత్సాహం నింపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు నడ్డా. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద నిరాశలో కూరుకుపోయిన కమలం కేడర్‌కు నడ్డా బహిరంగసభ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం.. పక్క పార్టీల నాయకులకు గాలం
Comments
Please login to add a commentAdd a comment