నీతిలేని పార్టీలు.. సిగ్గులేని మాటలు | Telangana: Minister KTR Fires On Congress BJP Party | Sakshi
Sakshi News home page

నీతిలేని పార్టీలు.. సిగ్గులేని మాటలు

Published Tue, May 10 2022 1:43 AM | Last Updated on Tue, May 10 2022 9:04 AM

Telangana: Minister KTR Fires On Congress BJP Party - Sakshi

దళితబంధు లబ్ధిదారుడికి ఇచ్చిన ట్రాక్టర్‌ను సరదాగా నడుపుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు

దమ్ముంటే ‘పాలమూరు’కు హోదా తెండి 
పాలమూరు–రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని గతంలో హైదరాబాద్‌ సభలో సుష్మ చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ నేతలకు దమ్ముంటే, మీ ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలి. 14న అమిత్‌ షా రాష్ట్రానికి వస్తున్నడట కదా.. చేతనైతే తెలంగాణకు కృష్ణా నదిలో 575 టీఎంసీల వాటా, పాలమూరుకు జాతీయ హోదాను అమిత్‌షాతో చెప్పించండి.     
– కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ‘‘రెండు జాతీయ పార్టీలు నీతిలేని పార్టీలు.. మాట మీద ఉండేవి కాదు.. ఒకరు 50 ఏళ్లు, మరొ కరు 17 ఏళ్లు పాలించినా.. మాటలే తప్ప పాలమూరుకు చేసిందేమీ లేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. రైల్వే లైన్లు ఇవ్వలేదు. అయినా కృష్ణాజలాల్లో నీటి వాటా తీసుకోవడంలో తెలంగాణ ప్రభు త్వం విఫలమైందంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 

ఎప్పటికైనా, ఏనాటికైనా తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ వేరేవాళ్లకు ఉండదు’’అని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సంద ర్భంగా నారాయణపేటలో నిర్వహించిన ప్రగతిసభలో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

అన్నీ దిక్కుమాలిన మాటలు 
‘‘పాలమూరు పచ్చబడుతుంటే, నారాయణపేటలో చెరువులు నిండుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయి. నిన్నగాక మొన్న ఒకాయన వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారు. కృష్ణాజలాల్లో నీటి వాటా తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందం టూ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులు ఉండేవి.

రాష్ట్రం వేరుపడ్డ నాటి నుంచి నీటి పంపకాలు తేల్చండి అని అడుగుతూనే ఉన్నాం. స్వయంగా కేసీఆర్‌ వెళ్లి ప్రధాని మోదీని కలిసి మరీ అడిగారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్ల గొండ జిల్లాల్లో సాగు, తెలంగాణకు తాగునీటి కోసం కృష్ణాలో 575 టీఎంసీల నీళ్లను ఇవ్వాలని.. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు ఈమేరకు సిఫార్సు చేయాలని కోరారు. ఇప్పటివరకు ఏమీ చేయలేదు. పైగా ఆ పార్టీ నేతలు జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. 299 టీఎంసీలకు కేసీఆర్‌ ఒప్పుకున్నారంటూ దిక్కుమాలిన మాటలు, అబద్ధాలతో రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

సిగ్గులేకుండా పాదయాత్రలు 
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు పథకాలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా లో చెరువులు నింపడానికి రూ.28 వేల కోట్లు ఖర్చు చేశాం. 8 లక్షలఎకరాలకు నీరు అందించాం. ఈ 28 వేల కోట్లలో మోదీ ప్రభుత్వం 28 పైసలైనా ఇచ్చిందా? వికారాబాద్‌ నుంచి కృష్ణాకు పోయేందుకు, గద్వాల నుంచి మాచర్లదాకా రైల్వేలైన్‌ అడుగు తుం టే ఇవ్వకుండా సిగ్గులేకుండా పాదయాత్ర లు చేస్తున్నారు.

పరీక్షలు ఉర్దూలో పెట్టొద్దం టూ బీజేపీ నేతలు విద్యార్థులను రెచ్చ గొడుతున్నారు. కేంద్రం నిర్వహించే పరీక్ష ల్లో ఉర్దూ లేదా, యూపీఎస్‌సీ పరీక్షలు ఉర్దూలో లేవా? అక్కడలేని బాధ ఇక్కడ ఎం దుకు. చిల్లర రాజకీయాలు చేసేందుకు సిగ్గుండాలి. 

రాష్ట్ర సొమ్మును మళ్లించారు 
రిజర్వ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాలో 12వ స్థానంలో ఉన్నా.. ఆర్థిక చోదక శక్తిగా 4వ స్థానంలో ఉంది. పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3,65,797 కోట్లు కట్టాం. రాష్ట్రానికి వచ్చింది రూ.1,68,000 కోట్లు మాత్రమే. తెలంగాణ సొమ్మును ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లకు ఖర్చు పెడుతున్నారు. మళ్లీ కేసీఆర్‌కు మేమే జీతం ఇస్తున్నామని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు..’’అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

కేసీఆర్‌ తర్వాత కేటీఆరే..: శ్రీనివాస్‌గౌడ్‌ 
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్నా మని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ తర్వాత రాష్టాన్ని నడిపించే నేత కేటీఆరేనని వ్యాఖ్యానించారు. సభలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్‌ పాల్గొన్నారు.  

చంపినోడే సంతాపం చెప్పినట్టుంది 
ఆయనకు క్లబ్బులు, పబ్బులే తప్ప ఎడ్లు తెలియవు, వడ్లు తెలియవు. ఆయనకు రైతు సంఘర్షణ సభ అట. ఒక్కచాన్స్‌ ఇవ్వండి అంటరు. 50 ఏళ్లు ఇచ్చారు.. ఏం చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో రైతుబంధు ఇవ్వట్లేదు. ఉత్తరప్రదేశ్‌లో రెండు సీట్లు గెలవలేదు. అమేథీలో ఎంపీగా ఓడిపాయె. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాడట. గూట్లో రాయి తీయకోడు.. ఏట్లో రాయి తీస్తా అన్నట్టుంది. 1,200 మంది పిల్లల ఆత్మత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఇది. ఇప్పుడొచ్చి సంపినోడే సంతాపం చెప్పినట్లుంది.    
– మంత్రి కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement