సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
షాద్‌నగర్: ఎడారిగా మారిన భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడితే కాంగ్రెస్ నేతలు అడుగడుగున అడ్డు తగులుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కోర్టు కేసులతో పాలమూరు పథకాన్ని అడ్డుకున్న పాపం కాంగ్రెస్ నాయకులదేనని ఆరోపించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో మంత్రి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. షాద్‌నగర్ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
నిజాం కాలంలోనే అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా సర్వే చేయించారని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పాలకుల నిర్వాకంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డు తగులుతూనే ఉన్నారని విమర్శించారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు జిల్లా ఇప్పటికే సస్యశ్యామలమయ్యేదని, వలసలన్న మాటే ఉండేది కాదన్నారు.
ఇటు కేసులు.. అటు ప్రశ్నలు
రూ.35వేల కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనులు చేపడితే పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పవన్‌కుమార్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులేశారని కేటీఆర్ ఆరోపించారు. ఓ వైపు కోర్టుల్లో కేసులు వేస్తూనే మరో వైపు ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రశ్నిస్తున్నారని.. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని, వారికి అందులో డాక్టరేట్, పీహెచ్‌డీలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పూర్తిగా వెనకబాటుకు గురైందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయన్నారు.
వెలుగుల ఘనత కేసీఆర్‌దే..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణలో చీకట్లు తప్పవని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిం చారని, ఆయన మాటలు తప్పని సీఎం కేసీఆర్ పాలన రుజువు చేసిందని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలు వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. కేసీఆర్ నిర్ణయాలు, అభి వృద్ధి కార్యక్రమాలను చూసి మిగతా రాష్ట్రాల వారు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఏపీ ప్రజలు అక్కడ టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు.
బహిరంగ సభకు హాజరైన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment