చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట  | Telangana Minister Niranjan Reddy Demands Naidu Apologise For Rice Remark | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట 

Published Tue, Feb 28 2023 4:11 AM | Last Updated on Tue, Feb 28 2023 4:11 AM

Telangana Minister Niranjan Reddy Demands Naidu Apologise For Rice Remark - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రూ.2కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని, మూర్ఖపు అహంకారానికి పరాకాష్ట అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, 15వ శతాబ్దం నుంచే హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీకి ప్రసిద్ధి అని పేర్కొన్నారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమంలో అనేకసార్లు ప్రస్తావించారని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.

11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు తెలంగాణ ప్రసిద్ధి అని వివరించారు.  ప్రపంచానికి తొలి వాటర్‌ షెడ్‌ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల వరకు గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్ధికి బాటలు వేశారని వివరించారు. అక్కసు, ఆక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది అని, 1956లో ఆంధ్రలో విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం పడిందని పేర్కొన్నారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘జొన్నకలి, జొన్నయంబలి జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్‌ సన్నన్నము సున్న సుమీ పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్‌ ’’ అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారని నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement