సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న ఆరు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపికలో బీసీలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి కనీసం రెండేసి సీట్లను ఇవ్వాలనే యోచనలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. అలాగే వెలమ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి చెరో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి (ఎల్.రమణ), అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి (విశ్వబ్రాహ్మణ) పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
శాసనసభలో ప్రాతినిధ్యం లేని బీసీ సామాజికవర్గంలో పద్మ శాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి కులాలకు చెందిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ మేరకే టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రచారం జరగ్గా ఆయన చేరిక సందర్భంగా కేసీఆర్ రాష్ట్రస్థాయి పదవి ఇస్తామని పరోక్షంగా హామీ ఇచ్చారు. మరోవైపు మూడో ఎమ్మెల్సీ పదవిని కూడా బీసీకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలి సింది. అదే జరిగితే మాజీ ప్రభుత్వ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్, కర్నె ప్రభాకర్, పీఎల్ శ్రీనివాస్, తాడూరు శ్రీని వాస్ పేర్లు పరిశీలనకు రావొచ్చు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హామీ పొందిన ఎంసీ కోటి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఒకే జిల్లా నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం దక్కుతుందా అనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి అల్లి పురం వెంకటేశ్వర్‌రెడ్డి ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు.
వెలమ, ఎస్సీ సామాజికవర్గాలకు చెరొకటి..
గతంలో ఇచ్చిన హామీ మేరకు వెలమ సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం మండలిలో ఈ సామాజికవర్గం నుంచి కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్, నవీన్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కవిత, భానుప్రసాద్ పదవీకాలం పూర్తవుతుండటంతో రవీందర్‌రావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయమవగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహుల పేర్లు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే లేదా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని పంపాలనే వ్యూహంతో అధినేత కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో పదవుల భర్తీలో యువతకు ప్రాధాన్యతనిస్తున్న కేసీఆర్ గతంలో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
‘స్థానిక’ కోటానూ దృష్టిలో పెట్టుకొని...
వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతోంది. ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల చివరి వారం లేదా డిసెంబర్ తొలివారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. దీంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులనూ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి మండలి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 16న పూర్తి కానుంది.
గవర్నర్ కోటా నుంచి ‘కౌశిక్’ ఔట్!
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం నామినేట్ చేసింది. అయితే ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు ఉండటంతో కౌశిక్ అభ్యర్థిత్వం నాలుగు నెలలుగా గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదు. నిబంధనల మేరకు కౌశిక్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదించే అవకాశం లేకపోవడంతో మరో అభ్యర్థిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా నుంచి తప్పించి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి పంపడమో లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడమో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Telangana: బీసీలు, రెడ్లకు రెండేసి ఎమ్మెల్సీలు?
Published Sat, Nov 6 2021 2:01 AM | Last Updated on Sat, Nov 6 2021 3:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment