![Telangana: Revanth Reddy Fires Brs Govt Over Power Cuts - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/11/Untitled-12.jpg.webp?itok=xRa8hk-j)
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రస్తుతం రాష్ట్రంలో 2003కు ముందు మాదిరి విద్యుత్ కోతలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. అప్పటి విద్యుత్ సంక్షోభం కారణంగా జరిగిన బషీర్‌బాగ్ ఉద్యమం నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం కుప్పకూలిందని, ఇప్పుడు మరోసారి బషీర్‌బాగ్ తరహా ఉద్యమం చేపట్టాలి్సన అవసరం ఉందని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లచ్చతండా నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో పాటు రాత్రి కొత్త లింగాల క్రాస్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందని, కానీ రైతులకు 24 గంటల విద్యుత్‌పై ఆడంబరపు ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్ అందులో విఫలమయ్యారని విమర్శించారు. ఆయనకు ప్రజలు ఇచ్చిన అవకాశం ముగిసిందని చెప్పారు.
విద్యుత్ కొనుగోళ్లలో వేలకోట్ల కుంభకోణం
విద్యుత్ కొనుగోళ్లలో రూ.వేలకోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ ఆరోపించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు రూ.60 వేల కోట్ల అప్పుల్లో ఉండగా, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా మారిందని చెప్పారు. పదిహేనేళ్ల క్రితం రిటైర్ అయిన ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాలరావులను ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎండీలుగా అందలం ఎక్కించారని విమర్శించారు. కేసీఆర్ చెప్పిన దగ్గరల్లా సంతకాలు పెట్టి.. వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకే వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ గోల్‌మాల్‌పై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించి, అధికారులను ఊచలు లెక్కబెట్టేలా చేస్తామని పేర్కొన్నారు.
భూకుంభకోణాలపై విచారణ కోరండి
తెల్లాపూర్‌కు సంబంధించిన 100 ఎకరాల భూ కుంభకోణం, మియాపూర్ భూముల కుంభకోణం, కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్ల పరిధిలో జరిగిన భూ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆస్తుల మీద, తన ఆస్తుల మీద, వారి వారి శాఖలు తీసుకున్న నిర్ణయాల మీద, తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు జడ్జితో విచారణ కోరుతూ లేఖ రాద్దామని సవాల్ చేశారు.
ఏసీడీ చార్జీలు చెల్లించొద్దు
వినియోగదారులెవరూ ఎవరూ ఏసీడీ చార్జీలు చెల్లించవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. తమ ప్రభుత్వం వచ్చాక చార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు..మంత్రి హరీశ్‌రావు సోదరుడే కావడంతో ‘చట్టంలో నిబంధన ఉంది, ఏసీడీ చార్జీలు వసూలు చేయొచ్చు’అని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే దోపిడీకి లబ్ధిదారులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని రేవంత్ ఆరోపించారు. కమ్యూనిస్టులు దోపిడీదారుల పక్షాన ఉంటారా, ప్రజల పక్షాన కొట్లాడతారో నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని కోరారు.
జవాన్ కుటుంబం వినతి
జనవరి 5న విధుల్లో ఉండగా మరణించిన జవాన్ భూక్యా రమేష్ కుటుంబ సభ్యులు యాత్రలో రేవంత్‌రెడ్డిని కలిశారు. జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉపాధి, ఉద్యోగం చూపించేలా చూడాలని కోరారు. ఈ యాత్రలో మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, నేతలు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌పై అనుచిత వాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment