సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు తిరుగుబాటుకు ఉపక్రమించారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితిని వివరిస్తూ, కింది స్థాయి కార్యకర్త నుంచి పార్లమెంటు ఇంఛార్జి, కోర్ కమిటీ వరకు ఈ మేరకు తమ డిమాండ్లు తెలుపుతూ లేఖ రాశారు.(చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..)
కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన చంద్రబాబు విధానంతో, పార్టీ నుంచి వలసలే తప్ప, చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్తగా ఎవరూ పార్టీలో చేరిన దాఖలాలు లేవు. అంతేగాక ప్రతీ ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు, గత ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టడంతో టీడీపీ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment