సాక్షి, కరీంనగర్: ఎంపీలుగా గెలిచినా, రాజ్యసభకు వెళ్లినా..ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ప్రస్తుత రాజకీయాల్లో అందరికీ శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలనే ఉత్సుకత..ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే గారూ అంటేనే వచ్చే కిక్కు వేరే లెవెల్ అన్నదే ఇప్పుడు రాజకీయనేతల మనసుల్లో నాటుకు పోయింది. ఆ క్రమంలో జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరెవరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగారని ఒక్కసారి చూస్తే..
ఇద్దరు ఎమ్మెల్సీలు..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో ఎమ్మెల్సీ పాడికౌశిక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన 2021లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తన స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ఆ స్థానానిక ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక ఈటల రాజేందర్ హుజురాబాద్‌తోపాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఒకవేళ రెండుచోట్ల రాజేందర్ విజయం సాధిస్తే.. ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తథ్యం.)
మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కూడా జగిత్యాల అసెంబ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జీవన్‌రెడ్డి 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకవేళ అసెంబ్లీపోరులో ఈయన గెలిస్తే.. 2025 వరకు అంటే దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో ఈయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చదవండి: కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే!
ఇద్దరు ఎంపీలు సైతం!
ఇద్దరు ఎంపీలు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. వీరిద్దరూ విజయం సాధించినా.. ఆరునెలలు మాత్రమే వీరి పదవీకాలం మిగిలి ఉండటంతో ఉపఎన్నిక రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గెలవకపోయినా.. వీరి పదవులకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment