నార్కట్‌పల్లిలో జరిగిన సభలో మాట్లాడుతున్న షర్మిల. చిత్రంలో విజయమ్మ
నార్కట్‌పల్లి: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని మండిపడ్డారు. రైతులను అధిక లాభం వచ్చే పంటలు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడి, ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేయాలంటూ కేసీఆర్ వ్యవసాయాన్ని బందీగా మార్చారన్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్లు అప్పులపాలు చేశారని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 47 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే.. కేసీఆర్ ఏడేళ్లయినా ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. 3లక్షల 85 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే కేవలం 80 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నట్టు ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లువేసి గెలిపిస్తే సీఎంగా బాధ్యతలు చేపట్టి నాటి వైఎస్ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కొండపాక గూడెం నుంచి...
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం వద్ద గత ఏడాది నవంబర్ 8న ఆగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం తిరిగి ఆ గ్రామం నుంచే ప్రారంభమైంది. షర్మిల మధ్యాహ్నం 3.20 గంటలకు కొండపాకగూడేనికి చేరుకున్నారు. 4.30 గంటలకు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. నార్కట్‌పల్లిలో సభ అనంతరం మాధవ ఎడవెల్లి గ్రామం మీదుగా పోతినేనిపల్లికి చేరుకుని అక్కడే బస చేశారు.
ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ
బంగారు తెలంగాణ రూపకల్పన కోసం రాజన్న బిడ్డ మీ ముందుకు పాదయాత్ర ద్వారా వస్తోందని, మీరు ఆశీర్వదించాలని వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. సభలో విజయమ్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ఆర్ లేని లోటు షర్మిల తీరుస్తుందన్నారు. గుడిసె లేని రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు.
నాడు రేషన్ షాపులో రూ.160కి 9 వస్తువులను ప్రజలకు అందిస్తే.. ప్రస్తుతం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, ఏపూరి సొమన్న, హర్షవర్ధన్, చైతన్యరెడ్డి, పోకల అశోక్, శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment