సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘రథయాత్ర’లకు బీజేపీ సిద్ధమౌతోంది. నిర్ణీతగడువు ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ జనవరి నుంచి వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. జనవరి 15 లేదా 16వ తేదీ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పర్యటనలు చేపట్టనున్నారు.
దాదాపు రెండువారాల్లో ఈ పర్యటనలు ముగిశాక, ఫిబ్రవరి మొదటి, రెండోవారంలో రథయాత్రలు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రం మొత్తాన్ని ఒకేసారి కవర్ చేసేలా నాలుగుదిక్కులా నాలుగు రథయాత్రలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల షెడ్యూల్, రూట్లపై చర్చించి, తుదిరూపునిచ్చేందుకు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ రాష్ట్రానికి రానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బండి సంజయ్ పాదయాత్రలకు కూడా బ్రేక్ పడినట్టు సమాచారం.
ఒకరిద్దరికే మైలేజ్ వచ్చేలా కాకుండా..
జనవరిలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలోని 16 నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరోవిడత పాదయాత్ర చేపట్టాలని తొలుత భావించారు. ఈ యాత్ర ఉంటే దానిపైనే మొత్తం పార్టీ యంత్రాంగం, వనరులు వంటివి పూర్తిస్థాయిలో కేంద్రీకరించాల్సి ఉన్నందున, బస్సుయాత్రలతో రాష్ట్రం నలువైపులా చుట్టివస్తే మంచిదనే అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ముఖ్యనేతలకే మైలేజ్ వచ్చేట్లు కాకుండా సమిష్టిగా నేతలకు ప్రాధాన్యత లభించేలా కార్యక్రమాలకు తుది రూపు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
7న అసెంబ్లీ సదస్సులు
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని సంస్థాగతంగా పూరిస్థాయిలో బలోపేతం చేయ డం, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ప్రభారీ, విస్తారక్‌ల చొప్పున నియామకం, అన్ని పోలింగ్‌బూత్ కమిటీల నియామకం పూర్తి, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు వంటి వాటిని వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించినట్టు సమాచారం. వచ్చేనెల మొదటివారం కల్లా మండలాల వారిగా బూత్ కమిటీల నియామకం పూర్తి చేసి, 7న 119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు పాల్గొనేలా అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సదస్సులనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.
నేడు నగరానికి బీఎల్ సంతోష్..
ఈ నెల 28, 29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ మంగళవారం రాత్రి నగరానికి చేరుకుంటారు. శిక్షణా శిబిరం ముగిశాక 29న సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీలతో సంతోష్, బన్సల్ సమావేశం కానున్నారు.
ఒక్కో సెగ్మెంట్‌కు ఐదుగురు పాలక్‌లు
ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురేసి చొప్పున ముఖ్యనేతలను బీజేపీ నియమించనుంది. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గసభ్యులు, ఇతర ముఖ్య నేతలను పాలక్‌లుగా నియమిస్తారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి ఒక స్థానికేతర ఇన్‌చార్జి (ప్రభారీ)ని కూడా నియమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment