సాక్షి, నంద్యాల/తాళ్లపూడి/కొవ్వూరు/వెంకటగిరి రూరల్: తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలను వీడడం లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, జైలుకు వెళ్లిన నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు.
అనారోగ్యం, ఇతర కారణాలతో రాష్ట్రంలోని చనిపోయిన వారిని చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే చనిపోతున్నారంటూ టీడీపీ తమ ఖాతాలో వేసుకుంటోంది. ఈ మరణాలను పచ్చపత్రికల్లో ప్రచురిస్తూ బాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయారంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఇది చూసి మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలకు, చంద్రబాబు అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ ఖాతాలో వేసుకున్న మరణాలు.. వాటి వెనుక నిజాలు..
నంద్యాల జిల్లా పాణ్యం మండలం, గోరుమానుకొండ గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు కుటుంబ సమస్యలతో చాలాకాలం క్రితం మద్యానికి బానిసయ్యాడు. గత నెల రోజులుగా మరింత ఎక్కువగా మద్యం సేవిస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం ఎక్కువగా తాగి.. ఆ మత్తులో పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లి అదేరోజు మరణించాడు. ఈ మరణాన్ని టీడీపీ నాయకులు తమ ఖాతాలో వేసుకున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని లింగాల గ్రామానికి చెందిన నెత్తికప్పుల నాగరాజు కుటుంబమంతా గతకొన్నేళ్లుగా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నారు. మంగళవారం నాగరాజు గుండెనొప్పితో మరణించారు. ఇతని కుటుంబ సభ్యులను బతిమలాడి, పార్టీ నుంచి ఆర్థికసాయం అందుతుందని మభ్యపెట్టి చంద్రబాబు రిమాండ్‌ను తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన టీడీపీ నాయకుడు చెరుకూరి సూర్యనారాయణ (80) వృద్ధాప్య సంబంధిత బాధలతో మంగళవారం మృతి చెందారు. ఈ మరణాన్ని సానుభూతి ఖాతాలో టీడీపీ నేతలు వేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త జొన్నకూటి శేఖర్ (45) కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి మూత్రవిసర్జనకు లేచి కుప్ప కూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య సోదరుడు టీడీపీ సానుభూతిపరుడు. అతని మాట ప్రకారం టీడీపీ వాళ్లు సాయం చేస్తారనే ఉద్దేశంతో వారి ఖాతాలో వేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాణిపేటకు చెందిన వీర కృష్ణయ్య (63) చేనేత కార్మికుడు. మంగళవారం సాయంత్రం తమ మిద్దెపైకి ఎక్కిన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కృష్ణయ్య మనుమడు మహేశ్ ఆయనను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. కృష్ణయ్య మృతికి చంద్రబాబు గృహ నిర్బంధం పిటిషన్ తిరస్కరణకు సంబంధం లేదని ఆయన మనుమడు మహేష్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటి షుగరు, బీపీతో బాధపడుతున్నాడు. మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు వెంకటి మృతికి ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment