( ఫైల్ ఫోటో )
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గంలో జరుగుతున్న బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశాలకు ఆహ్వానం గానీ, అందుకు సంబంధించిన సమాచారం గానీ తనకు అందలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఎన్నికల సమయంలో, పార్టీ బహిరంగ సభల సమయంలో నా సహాయం కోసం వస్తున్నారే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని అధిష్టానం సూచించిందని...అయితే స్థానిక నాయకత్వం సీఎం కేసీఆర్ ఆదేశాలను ఖాతరుచేయకుండా తనకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం సొంత ఖర్చులతో కష్టపడి పనిచేశామని, ఆయన ఎన్నికల్లో సహకరించాలని కోరగా సీఎం ఆదేశాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేశానని గుర్తు చేశారు. అదేవిధంగా 2015, 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశామని తెలిపారు.
కడియంను ఆహ్వానిస్తా: ఎమ్మెల్యే రాజయ్య
చిల్పూరు: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే 14 ఆత్మీయ సమావేశాల్లో భాగంగా సోమవారం శివునిపల్లిలో జరిగే సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు. పలువురు కడియం శ్రీహరిని ఆహ్వానించలేదని అనుకుంటున్నారని అందులో వాస్తవం లేదన్నారు.
జనగామ జిల్లా చిల్పూరు మండల పరిధి వెంకటాద్రిపేటలో దుర్గామాత, మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన రాజయ్య మాట్లాడుతూ...కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్సీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కోటిరెడ్డిని, కడియంను నల్లగొండకు నియమించారని, మొదట ధర్మసాగర్‌లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment