సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో జీ–23 అనే గ్రూప్ లేదని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి, ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నవారంతా ఒకే సిద్ధాంతంపై పనిచేస్తారని, గతంలో జరిగిన పరిణామాలను బట్టి పార్టీకి రాసిన లేఖపై కొందరు నేతలు సంతకాలు చేశారే తప్ప.. ప్రత్యేకమైన గ్రూప్ లేదని స్పష్టంచేశారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మేమంతా ఒక్కటే. మాకు సిద్ధాంత వైరుధ్యాలు లేవు. మా చర్చంతా బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే. అధ్యక్ష ఎన్నిక అనేది మా పార్టీ అంతర్గత విషయం’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తాను ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులు అన్నదే ఇక్కడ చర్చ అని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లిఖార్జున ఖర్గే గొప్ప నాయకుడని, ఆయనతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల తాను ఖర్గేతో మాట్లాడానని, పార్టీ విషయంలో ఖర్గేది తనది ఒకటే స్టాండ్ అని చెప్పారు.
అయితే, పార్టీని నడిపించే విషయంలో తన విజన్ తనకుంటే, ఖర్గే విజన్ ఖర్గేకు ఉంటుందని, తాను పార్టీ అధ్యక్షుడినయితే ఏం చేస్తాననే విషయంలో మేనిఫెస్టో కూడా తయారు చేశానని తెలిపారు. తెలంగాణ నేతలతో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కాఫీ తాగేందుకు తనను ఇంటికి పిలిచారని, అయితే తాను వెళ్లలేకపోయానని చెప్పారు. రేవంత్‌రెడ్డి పిలిస్తే గాంధీభవన్‌కు వచ్చి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రచారం చేస్తానని శశిథరూర్ తెలిపారు.
ఆసక్తి రేకెత్తించిన ట్వీట్..
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతానని చెప్పిన శశిథరూర్ సోమవారం చేసిన ట్వీట్ కాంగ్రెస్‌వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘రేవంత్ దగ్గరి బంధువు చనిపోయారని, ఆయనకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని, రేవంత్ అండ్ టీం బెస్టాఫ్ లక్..’అని శశిథరూర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇదే విషయంపై గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ను ప్రశ్నించగా, శశిథరూర్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారని, తనకు ఫోన్ చేస్తే కాఫీకి ఇంటికి ఆహా్వనించానని, అయితే తన బంధువు చనిపోవడంతో పరామర్శకు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే కలవడం కుదరలేదని తెలిపారు. అంతే తప్ప శశిథరూర్‌ను కలవకూడదన్న ఉద్దేశం తనకు లేదని చెప్పడం గమనార్హం.
‘రైడ్స్’ భయంతోనే ప్రశ్నించరు
అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం వ్యాపారవేత్తల్లో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు శశిథరూర్ అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోయినా, ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్నా.. రైడ్స్ చేయించడం, ట్యాక్స్‌లు విధించడం లాంటి జరుగుతుంటాయని అందుకే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలను ప్రశ్నించరని తెలిపారు. ఈ వైఖరి పాశ్చాత్య దేశాల్లోనూ ఉంటుందన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో శశిథరూర్‌తో సోమవారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీనియర్ పాత్రికేయులు కర్రి శ్రీరామ్ అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్ శుభ్రమహేశ్వరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.
పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎంతో రాణిస్తున్నారని, పురుషులకన్నా నిబద్ధతతో ఆలోచిస్తున్నారని ప్రశంసించారు. మహిళల్లో ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నా, సమాజం, సంస్కృతి, సంప్రదాయాల వల్ల ఎక్కువగా రాలేకపోతున్నారన్నారు. ప్రతి ప్రభుత్వరంగ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఉండాలని, కానీలేరని, ఇదే ప్రశ్న తాను పార్లమెంట్‌లో లేవనెత్తితే సరైన సమాధానం రాలేదని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో మహిళలకు గౌరవం ఉందని, మొట్టమొదటి ఎన్నికల్లోనే మహిళలకు ఓటు హక్కు మన దేశంలోనే కలి్పంచారని గుర్తు చేశారు.
చదవండి: దుర్గా మండపంలో విగ్రహం వివాదం.. మహిశాసురుడిలా గాంధీ!
Comments
Please login to add a commentAdd a comment