సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆఫీసుతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఫైళ్లు, ఇతర వస్తువులను తరలించే ప్రయత్నాన్ని ప్రజలందరూ చూశారని, స్థానికులు, పోలీసులు అప్రమత్తమవడంతో వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు.
ధీరజ్‌పై రాహుల్‌కు ఎందుకంత ప్రేమ?
మూడు రోజులుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు నిర్వహిస్తున్న తీరు దేశం మొత్తం విస్తుపోయేలా చేసిందని, నగదు దొరకడం చరిత్రలోనే మొదటిసారి అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధీరజ్ సాహు ఆపార్టీ నేత రాహుల్ గాందీకి అత్యంత సన్నిహితుడని, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని, ధీరజ్‌పై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్యమంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని, ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి రూ. వందల కోట్లను తెలంగాణ ఎన్నికలకు తరలిస్తూ పట్టుబడటం చూశామన్నారు. ధీరజ్ సాహులాగే కర్ణాటకలో మరో నాయకుడు నుండి ఈ డబ్బు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కర్ణాటకలో ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్షనేత ఎంపికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అదంతా దుష్ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమ వారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment