బయటపడిన సమన్వయ లోపం ప్రభుత్వ రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముగ్గురు ఎమ్మెల్యేలు
ఎలాంటి సంకేతాలు వెళ్తాయంటున్న పార్టీ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభ్యుల మ«ధ్య సమన్వయలోపం బయటపడింది. పార్టీ పక్షాన గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కొంతకాలంగా ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోవిడత రుణ మాఫీ కార్యక్రమానికి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం చర్చనీయాంశమయ్యింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని ఒకపక్క పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే.. మంగళవారం నాటి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు ఇటు పార్టీలో అటు శాసనసభాపక్షంలో వినిపిస్తున్నాయి.
శాసనసభా సమావేశాల తొలిరోజునే లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ దాకా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వైఖరికి భిన్నంగా ప్రభుత్వం నిర్వహించిన రుణమాఫీ కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటే ఎలాంటి సంకేతాలు వెలువడతాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
రాష్ట్ర పార్టీ నాయకత్వం స్పష్టతనివ్వకపోవడం వల్లే..!
అసెంబ్లీలో బీజేఎల్పీ వివిధ ముఖ్యమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై రాష్ట్రపార్టీ నాయకత్వం స్పష్టతనివ్వక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. అసెంబ్లీలో కేటాయించిన గదికి సభలోంచి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చేటప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ రుణమాఫీ కార్యక్రమానికి వెళ్లిపోయారు.
దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఇలా చేస్తే పార్టీ కేడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ ఆ కార్యక్రమానికి హాజరుకాని ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టుగా వారు పెద్దసంఖ్యలో వాయిదా తీర్మానాలను ప్రతిపాది స్తున్నారనే అంశంపై కూడా పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీనియర్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అప్పుడప్పుడు మాత్రమే సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతోనూ ఆయన అంత సఖ్యతగా లేరనే అభిప్రాయం ఇప్పటికే పార్టీవర్గాల్లో ఉంది. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ సొంత ఇమేజీని పెంచుకునే ప్రయత్నాల్లో మునిగినందునే సమన్వయలేమి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
Comments
Please login to add a commentAdd a comment