సాక్షి, తిరుపతి : పంచాయతీ.. మున్సి‘పోల్స్’ఫలితాలే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ పునరావృతం అవుతాయని నిర్ధారించుకున్న టీడీపీ, బీజేపీలు.. ఇప్పుడు ఆ పోరులో ద్వితీయ స్థానం కోసం పోటీపడుతున్నాయి. అందుకు శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అరాచకాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేందుకు కుట్రలకు తెరతీస్తున్నాయి. ఇందుకోసం కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇరు పార్టీల అధినేతలు తమతమ శ్రేణులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ సమావేశం కొంత హాట్‌హాట్‌గా జరిగింది. ఇందులో టీడీపీ కార్యకర్తలు నాయకత్వ లోపంపై ఫిర్యాదు చేసినా.. అధినేత చంద్రబాబు అవేవీ పట్టించుకోలేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే సమయమిది కాదంటూ కార్యకర్తలను మందలించినట్లు తెలిసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పరువుపోయిందని.. తిరుపతి ఉప ఎన్నికలో అయినాసరే కనీసం రెండో స్థానం దక్కించుకునేందుకు పోరాడాలని చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. ‘మనకు జనసేన మద్దతు ఉంటుంది. అయితే, ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తపడండి. జనసేన కార్యకర్తలతో మంచిగా మెలగండి’.. అని టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
అరాచకాలకు కమలనాథుల కుట్రలు
ఇక ఈ పోరులో ద్వితీయ స్థానం దక్కేలా కృషిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. తిరుపతిలో శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఉప ఎన్నికల్లో పరువు పోకుండా ఉండాలంటే ఏం చేయాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు. తనకు బాధ్యతలు అప్పగిస్తే శాయశక్తులా కృషిచేస్తానని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోము వీర్రాజుని కోరినట్లు తెలిసింది. అయితే, తాను చెప్పినప్పుడు కేంద్ర మంత్రులను తిరుపతిలో ప్రచారానికి పంపాలని కోరారు. అదే విధంగా అరాచకాలు, మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేశానని ఆయన తెలిపినట్లు సమాచారం. కానీ, కేసులు, అరెస్టులు లేకుండా బీజేపీ పెద్దలు బాధ్యతలు తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలిసింది. దీంతో ఉప ఎన్నిక బాధ్యతను ఆదినారాయణరెడ్డికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment