సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. రాష్ట్రంలో అరాచకాలను చంద్రబాబు ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దిశా యాప్‌తో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టామని గుర్తు చేశారు.
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారు. ఎక్కువ కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో కలిపారు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో అరాచకాలను చంద్రబాబు ఎందుకు అదుపు చేయడం లేదు. మహిళలపై జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలో దిశా యాప్ తీసుకొచ్చాం. దిశా యాప్‌తో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టాం. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. రోజుకొక ఘటన జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. దిశ యాప్ ఉన్నట్టయితే యువతి బతికి ఉండేది. అత్తకోడళ్లపై లైంగిక దాడులు జరిగేవి కావు. ఇప్పడు కూటమి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా ఎందుకు చేయటం లేదు?.
రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయింది. అందుకే బద్వేలు ఘటన లాంటివి జరుగుతూనే ఉన్నాయి. దళితులను అణచివేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకే విశ్వరూప్ లాంటి బలమైన లీటర్లను టార్గెట్ చేశారు. హోంమంత్రి సెల్ఫీలతో కాలం గడుపుతున్నారే తప్ప పని చేయటం లేదు. పక్క పార్టీ వారిని తిట్టటమే తప్ప హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక్క ఘటనపై కూడా కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కేవలం నేమ్ ప్లేట్ హోంమంత్రిగానే మిగిలిపోయారు. వరుస ఘటనలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. లోకేష్ ప్రసంగాలు నేర ప్రవృత్తి గల వారికి ఉత్ప్రేరకంగా మారింది. మచ్చమర్రి ఘటనలో చిన్నారి మృతదేహాన్ని కనీసం గుర్తించలేకపోయారు. పిఠాపురంలో టీడీపీ నేతే మత్తుమందు ఇచ్చి ఒక యువతిపై అత్యాచారం చేశాడు. నాలుగు నెలల్లోనే 74 ఘటనలు జరిగితే ఇక ఈ ఐదేళ్లలో పరిస్థితి ఏంటి?. మహిళలు, చిన్నారులకు రక్షణ ఉంటుందా?. పాలకుడే నేరాలు చేయమని ప్రోత్సాహిస్తుంటే ఇక ప్రజలు బతికేది ఎలా?.
నందిగం సురేష్, పినిపే విశ్వరూప్ కుమారుడిని జైలులో పెట్టారు. ఆ పోలీసులతో రాజకీయాలను తారుమారు చేయాలని చూస్తున్నారు. టీడీపీ నేతలు ఆడినట్టు ఆడితే పోలీసులకు మచ్చ వస్తుంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమని కోరుతున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థకు ఐదుసార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. లోకేష్ పిల్ల రాక్షసుడుగా మారారు. ఆయన వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయి. సూపర్ సిక్స్ అమలు చేసేంత వరకు వైఎస్సార్‌సీపీ ఊరుకోదు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్‌లోకి నెట్టినా మేము ప్రశ్నించకుండా ఆగము. ఎక్కువ కేసులు ఉన్నవాడే బెస్టు లీడర్ అని లోకేష్ అంటున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment