మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
ఆ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినయ్
బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధికన్నాఅన్యాయమే ఎక్కువ
19న లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఉండదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ కి నూకలు చెల్లాయని, పదేళ్ల పాలనలో యథేచ్ఛగా నీళ్లు, నిధులు, భూములు దోపిడీ చేసిన బీఆర్‌ఎస్ ను ప్రజలు 2023లో గద్దె దించారని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదు.. మొత్తం అన్యాయమేనని, దీనిపై తాము చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు.
19న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం హనుమకొండకు విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ముందుగా నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రా న్ని బీఆర్‌ఎస్ అప్పుల తెలంగాణగా మార్చిందని, ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్ర మే బంగారుమయం అయ్యిందని.. పేదలు అష్టకష్టాలు పడ్డారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రతిపక్ష హోదాను నిర్వర్తించకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. తెలంగాణలో ఉనికి కోసం కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యతి్నస్తున్నదన్నారు. మూసీ ప్రక్షాళన అవసరమా, కాదా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేయాలన్నారు.
కులగణనతో దేశానికే రోల్‌మోడల్..
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు మహేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పది నెలల రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నేపథ్యంలో నిర్వహించనున్న ఈ సభ చరిత్రాత్మకంగా నిలవబోతుందన్నారు.
రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కులగణన చేపడుతోందని, కులగణనతో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నాడని, తాను జైలుకు పోవడం ఖాయమని కేటీఆర్‌కు తెలిసిపోయిందని చెప్పారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశీలించారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ మురళీనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment