సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కలిసి సమన్వయంతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పెద్దలను కలిశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గేను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా 2019 కంటే ఐదు స్థానాలు ఎక్కువగానే సాధించాం.
కేబినెట్ విస్తరణపై ఏఐసీసీదే నిర్ణయం..
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సీఎం, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారు. దీనిపై వారే నిర్ణయం తీసుకుంటారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంతవరకు పాత కమిటీలు పనిచేస్తాయి. బాధ్యతలు చేపట్టాక కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతాను. ప్రజలు నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు, సమన్వయంతో పనిచేస్తున్నాం. కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మాకు ఓ సవాల్. పీసీసీ కమిటీలలో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉంటాయి.
అరికెపూడి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే..
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చింది. మరికొంతమంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ సవాళ్లను పట్టించుకునే స్థితిలో లేరు. ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించే స్థితిలో లేరు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారు?. బీఆర్‌ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకనే కారు పార్టీ నేతలు మా పార్టీలో చేరుతున్నారు. ఉప ఎన్నికలు రావు. ఉప ఎన్నికలు వచ్చినా మేము సిద్ధమే. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మళ్లీ గెలుస్తారు. అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే’ అని చెప్పుకొచ్చారు.
అలాగే, హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై కూడా ఆయన స్పందించారు. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోతున్న పేదలకు న్యాయం చేయాలి. తెలిసో తెలియకో పేదల అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఇది కచ్చితంగా రేవంత్ చేయించిన దాడే.. కేటీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment