
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక వేదికగా ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుటిల యత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రేవంత్‌రెడ్డి ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు.
ఉప ఎన్నికలో ప్రజాసమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు రాజేస్తూ రాజకీయలబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సాధారణ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బీజేపీ నెరవేర్చలేదని, ప్రతి పౌరుడి అకౌంట్‌లో రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను వంచించిందని విమర్శించారు.
నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించి పేదలను ఆదుకోవాలన్న ఆలోచనే బీజేపీకి రాలేదని, అలాంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను హామీలుగానే మిగిల్చిన టీఆర్‌ఎస్‌కు కూడా ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
ఆ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు, కోదండరాంతో కలసి పోరాడుదామని, సమన్వయంతో ముందుకెళదామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెపుదామని రేవంత్‌రెడ్డి ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
నిఖార్సైన కాంగ్రెసోడా... డిసైడ్ చేద్దాం రా!
ట్విట్టర్ వేదికగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు మరో పిలుపునిచ్చారు. ‘మునుగోడు ఎజెండా ఏంటి? చర్చనా.. రచ్చనా? బీజేపీ, టీఆర్‌ఎస్ వైఫల్యాలా.. వ్యక్తిగత పంచాయితీలా? నిఖార్సైన కాంగ్రెసోడా... డిసైడ్ చేద్దాం రా... మన మునుగోడు... మన కాంగ్రెస్’అంటూ ఆయన తన ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్ చేశారు.
రేవంత్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎనమల రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం.. వీరుల త్యాగం.. నేటి మన స్వాతంత్య్రమని పేర్కొన్నారు.
వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, సేవ రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పాలకులదని తెలిపారు. బీజేపీ పాలకులు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment