టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సంచలన కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్య నేతలు, గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాజరై సెప్టెంబర్ 17, మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రపై చర్చించారు. అనంతరం పలు కీలక తీర్మానాలను చేశారు. ఈ తీర్మానాల వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్‌టైం పనిచేస్తున్నాయి
సెప్టెంబర్ 17కు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, కానీ చరిత్రను కనుమరుగు చేసే విధంగా టీఆర్‌ఎస్, బీజేపీల అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్‌టైం పనిచేస్తూ తమను భాగస్వాములుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ, హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ బీజేపీ, దాని మూలాలున్న ఏ సంస్థ కూడా పాల్గొనలేదని అన్నారు.
కానీ వాళ్లే తెచ్చినట్టుగా ప్రజలకు భ్రమలు కల్పించేందుకు రెండు పార్టీలు పోరాడుతున్నాయని చెప్పారు. వాస్తవానికి ఆ డీఎన్‌ఏ తమదని, 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించే హక్కు, అధికారం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, తమ తర్వాత కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని చెప్పారు.
మునుగోడులో కలిసికట్టుగా..
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని స్థాయిల్లోని నాయకులు కలిసికట్టుగా పనిచేస్తారని రేవంత్ చెప్పారు. ఇందుకోసం మంగళవారం చౌటుప్పల్‌లో ఇన్‌చార్జులందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ హాజరవుతారని తెలిపారు.
నాలుగు చోట్ల బహిరంగ సభలు
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర విజయవంతం కోసం త్వరలోనే అందరితో మాట్లాడి కమిటీలను నియమిస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రవేశించి మహారాష్ట్రకు వెళ్లేంతవరకు రాహుల్ యాత్రలో అందరినీ భాగస్వాములను చేసా్తమని అన్నారు. కాగా రాహుల్‌యాత్ర సమయంలో మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
టీపీసీసీ తీర్మానాలివే..
►సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు ఏడాది పొడవునా తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణ
►తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీజీ అని రాసుకుని ఉద్యమాలు చేస్తే టీఆర్‌ఎస్ కుట్రతో, వారి పార్టీకి అనుసంధానించేలా తెరపైకి తెచ్చిన టీఎస్ (టీఆర్‌ఎస్‌లో ఆర్‌ను సైలెంట్ చేసి)ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. టీఎస్‌ను టీజీగా మార్చాలి. అధికారంలోకి వచ్చాక పాలన మొత్తాన్ని టీజీ పేరుతో నిర్వహించాలి.
►అందెశ్రీ అందించిన అద్భుతమైన ‘జయ జయహే తెలంగాణ’ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా మార్చాలి.
దొరల తల్లి స్థానంలో..
►ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి దొరల తల్లి. దొరసానిగా భుజకీర్తులు, కిరీటాలున్న ఈ తల్లిని తిరస్కరించాలి. టీఆర్‌ఎస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాల తల్లిగా కనిపించే విధంగా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఆవిష్కరించాలి. కడుపులో పెట్టుకుని కాపాడుకునే తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజానికి సెప్టెంబర్ 17 నుంచి అంకితం చేయాలి.
►సెప్టెంబర్ 17 పురస్కరించుకుని జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా తెలంగాణ జెండా రూపొందించాలి. ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఎగురవేయాలి.
Comments
Please login to add a commentAdd a comment