మునుగోడులో సీఎం సభకు సిద్ధమైన వేదిక
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన టీఆర్‌ఎస్ శనివారం అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా టీఆర్‌ఎస్ బలాన్ని చూపించాలని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి రెండు వేల కార్లు, ఇతర వాహనాలతో అతి భారీ ర్యాలీగా మును గోడు బహిరంగ సభకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ సభను అత్యంత సవాల్‌గా తీసుకుని భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదిరోజులుగా క్షేత్రస్థాయిలోనే ఉండి శ్రమిస్తున్నారు.
అమిత్ షా సభకు ముందే..
మునుగోడులో ఆదివారం జరగనున్న బీజేపీ బహి రంగ సభకు అమిత్‌షా హాజరవుతుండటంతో ఒక రోజు ముందే భారీ బల ప్రదర్శనకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి మధ్యా హ్నం 2 గంటల సమయంలో మునుగోడుకు చేరు కుంటారు.
ఈ కాన్వాయ్‌ను టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు రెండు వేలకుపైగా కార్లతో అనుసరించనున్నారు. ఇందులో వెయ్యి వాహనాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని నుంచి బయలుదేరుతాయి. మిగ తావి మార్గం వెంట ర్యాలీలో కలవనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చే కార్లు, వాహనాలు మధ్యాహ్నం 12 గంటలకల్లా పెద్ద అంబర్‌పేటకు చేరుకుని, అక్కడి నుంచి ర్యాలీగా మునుగోడుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ర్యాలీలో మునుగోడు సభకు వెళ్లనున్నారు.
‘ప్రజా దీవెన’ సభగా పేరు
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో జరగనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభకు ‘మునుగోడు ప్రజాదీవెన’ సభగా పేరుపెట్టారు. ‘చలో మునుగోడు’ పేరిట ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల స్టిక్కర్లతో ఉన్న వాహనాల్లో పార్టీ శ్రేణులు సభకు తరలనున్నాయి. మరోవైపు మార్గం వెంట, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అభివృద్ధి.. సెంటిమెంట్..
మునుగోడు సభలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు.. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, ఆర్థిక దిగ్బంధం ద్వారా ఇబ్బందిపెడుతున్న తీరును ఎండగట్టనున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్ రాజీనామాలు చేస్తే.. ప్రస్తుతం బీజేపీ తెలంగాణను కబళించడం కోసం రాజీనామాలను అడ్డు పెట్టుకుంటోందంటూ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని అంటున్నాయి.
సభ వివరాలివీ..
►మునుగోడు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్ ‘మునుగోడు ప్రజాదీవెన’ సభ ప్రారంభమవుతుంది.
►సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి పెద్ద అంబర్‌పేట్, పోచంపల్లి ఎక్స్ రోడ్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకుంటారు. మధ్యలో పార్టీ శ్రేణులు కలుస్తాయి.
►సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
►వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఆరు చోట్ల పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment