సాక్షి, ఢిల్లీ: పొన్నాల లక్ష్మయ్య రాజీనామా పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం పొన్నాల లక్ష్మయ్య చేసిన అతిపెద్ద నేరం. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా అప్పుడు 40 వేల ఓట్లతో ఓడిపోయారాయన. ఇప్పుడు పార్టీ మారడానికి పొన్నాలకు సిగ్గుండాలి అని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి.. పొన్నాల తక్షణమే తన రాజీనామా ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక బీసీలకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యం దక్కడం లేదన్న పొన్నాల ఆరోపణలను రేవంత్ ఖండించారు. బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇస్తుందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 50 శాతం సీట్లు ఇస్తామని రేవంత్ తెలిపారు.
‘‘యాభై శాతం సీట్లు కొలిక్కి వచ్చాయి. మిగిలినవి తొందర్లోనే ఖరారు చేస్తాం. మస్కతి అలీంను చార్మినార్ నుంచి పోటీ చేయాలని కోరాం. ఆరు గ్యారెంటీ లకు తోడుగా ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ ఇస్తున్నాం. నూటికి నూరుశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక.. బీఆర్‌ఎస్ సర్కార్‌పైనా రేవంత్ విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ పోలీసు ‘‘రావు’’ అధికారులు.. కేసీఆర్ ప్రైవేట్ సైన్యం గా పని చేస్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర క్రిస్టియన్ మైనార్టీ ల సమావేశం ఏర్పాటు చేయడం తగదు. తనకు నచ్చిన వారికి రామకృష్ణ రావు నిధులు విడుదల చేస్తున్నారు. అరవింద్ కుమార్ ఎన్నికల కోడ్ తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతిపరులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని ఆరోపించిన రేవంత్.. దీనిపై వెంటనే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
పొన్నాలను పట్టించుకోవాల్సిన పని లేదు
గెలుపు ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేశామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ.. 62 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం. వామపక్షాలతో పొత్తుల అనంతరం మిగిలినవి ఫైనల్ చేస్తాం. బస్సు యాత్ర కంటే ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం అని అన్నారు.
పొన్నాల ఎపిసోడ్‌పైనా మురళీధరన్ స్పందిస్తూ.. ‘‘ అభ్యర్థుల జాబితా విడుదల కంటే ముందు పొన్నాల ఎలా రాజీనామా చేస్తారు?. పార్టీలోకి చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. పొన్నాల రాజీనామాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment