గీత కార్మికుడితో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: సబ్బండ వర్గాల ఉద్యమకారుల ఆత్మబలిదానాలతో సిద్ధించిన తెలంగాణ ప్రగతిభవన్ గేట్లను బద్దలు గొట్టి అమరులు కన్న కలలు సాకారం దిశలో సోనియాగాంధీ రాజ్యం తీసుకొద్దామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జనగామ జిల్లా జఫర్‌ఘడ్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ వరకు హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో ప్రజాసమస్యలను తెలుసుకున్న ఆయన స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభ లో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఊళ్లలో తప్పు ను తప్పు.. అనే స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. ఈసారి కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే.. బతుకులు బాగుపడతాయని పిలుపునిచ్చారు. మరోసారి వస్తే రాచరిక పాలన పేట్రేగిపోతుందన్నారు.
కడియం, రాజయ్యలు ఏమి ఒరగబెట్టారు..
కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలకు అదృష్టం కలిసి వచ్చి విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రులతోపాటు ఉపముఖ్యమంత్రులుగా అవకాశం వచ్చినా.. ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. గురువులుగా పనిచేసిన వీరు సొంత నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. దొరల గడీలో చేరాక చచ్చిన పాములా, బానిసలా బతుకుతున్న కడియంసార్‌ను... పిల్చటోడు.. కూ ర్చోబెట్టడోడు లేడు.. ఆఖరికి రాజయ్య తరిమికొట్టేందుకు పురమాయించే పరిస్థితిలో ఉన్నాడు’అని వ్యాఖ్యానించారు.
ఘనుడు రాజయ్య గురించి పాదయాత్రలో ఆడబిడ్డలు చెబుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదని అన్నారు. నడ్డి మీద తన్ని అవినీతి ఆరోపణలు పెట్టి కేబినెట్‌నుంచి ఇంటికి పంపించేలా రాజయ్య చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు. రాజీనామా పత్రం తీసుకోకుండా ఏకంగా బర్తరఫ్ చేయడంతో దళితులపట్ల సీఎం కేసీఆర్ వైఖరి వెల్లడైందని విమర్శించారు.
ఈ విషయంలో రాజయ్యకు సిగ్గులేకుండా పోవచ్చుగానీ, మాదిగ బిడ్డలకు పౌరుషం ఉందని, త్వరలో కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజయ్యపై చేసిన ఆరోపణలపై నేటికి విచారణ జరగలేదని, ఇందులో కేసీఆర్‌కు వాటా ఉందని అర్థమవుతుందన్నారు. వరంగల్‌కు వైద్య విధాన పరిషత్ తెస్తానని రాజయ్య ప్రకటించడంతో చిర్రెత్తకుపోయిన సీఎం కర్రు కాల్చి వాత పెట్టాడన్నారు.
శ్రీహరితో పోల్చితే ఎర్రబెల్లి ఎందుకూ పనికిరాడు
శ్రీహరితో పోల్చితే... ఎందుకు పనికిరాని ఎర్రబెల్లిని మంత్రి వర్గంలో తీసుకోవడంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఉద్యమ వారసులుగా అడుగుతున్నాము.. సోనియాగాంధీకి ఇప్పటికైనా కృతజ్ఞతగా కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. త్వరలో డ్వాక్రా మహిళలకు నేరుగా ప్రియాంకాగాంధీ వరాలు ప్రకటిస్తారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సుదర్శన్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, దయాసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సింగపురం ఇందిర, అమృతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment